గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు బ్రేక్ చేస్తున్న మరో మెటల్ ఇదే, వారి పంట పండింది!
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో మరో అత్యంత విలువైన లోహం తాను పోటీలో ఉన్నానంటు ముందుకు వచ్చింది. తాను ఏ మాత్రం తక్కువ కాదంటూ ధరల పెరుగుదలలో రికార్డులు తిరగరాస్తోంది. ఆ లోహమే ప్లాటినం. ఏకంగా 173 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

గత కొంత కాలంగా బంగారం, వెండి ధరలు అడ్డూ అదుపు లేకుండా భారీగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ లోహాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, వీటికి పోటీగా మరో అత్యంత విలువైన లోహం కూడా ఎంట్రీ ఇచ్చింది. అదే ప్లాటినమ్. భారతదేశంలో ఈ ఏడాది ప్లాటినం ధర ఏకంగా 173 శాతం పెరిగిపోవడం గమనార్హం.
అయినప్పటికీ, బంగారం, వెండి కంటే కూడా ప్లాటినం ధర తక్కువగానే ఉందని చెప్పవచ్చు. పది గ్రాముల ప్లాటినం ధర రూ. 70,000 కంటే తక్కువగానే ఉంది. అయితే, ఈ ఏడాది 173 శాతం ప్లాటినం ధర పెరగడంతో ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది.
గోల్డ్, సిల్వర్‌ను వెనక్కి నెట్టిన ప్లాటినం
డిసెంబర్ 27న 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 4,320 నుంచి 68,950కి పెరగ్గా.. 100 గ్రాముల ప్లాటినం రేట్ ఏకంగా 43,200 నుంచి రూ. 6,89,500కు పెరిగింది. ప్రస్తుతం చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి నగరాల్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 68,950గా ఉంది. బంగారం, వెండి లాగానే ప్లాటినం ధర కూడా రికార్డు హైకి చేరుకోవడం గమనార్హం. అయినప్పటికీ బంగారం, వెండి కొనుగోళ్ల కంటే ప్లాటినం కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయి.
డిసెంబర్ 2025లో బంగారం 24 కారట్ 10 గ్రాముల బంగారం ధర 8.24 శాతం పెరగ్గా, వెండి 33.51 శాతం పెరిగింది. అదే సమయంలో ప్లాటినం మాత్రం ఏకంగా 41.5 శాతం పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. గత సంవత్సరం డిసెంబర్ 28, 2024 నాడు ప్లాటినం 10 గ్రాముల ధర రూ. 25,250 ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం ఊహించని విధంగా 173.06 శాతం పెరగడం సంచలనంగా మారింది.
ప్లాటినం ఇన్వెస్టర్ల పంట పండింది
ఈ క్రమంలో బంగారం, వెండి లోహాలపై ఇన్వెస్ట్ చేసిన వారి కంటే ప్లాటినంపై పెట్టుబడి పెట్టుకున్నవారు అత్యధికంగా లాభపడ్డారు. 2024లో ప్లాటినంపై రూ. 50,000 పెట్టుబడిన వారికి 2024 డిసెంబర్‌లో 173.07 శాతం లాభం పొందారు. అంటే పెట్టిన రూ. 50,000లకు డిసెంబర్ 27, 2025 నాటికి వారు రూ. 1,36,500 లాభంగా ఆర్జించారు.
ప్లాటినం ధరలు పెరగడానికి కారణం?
ట్రేడింగ్ ఎకనామిక్స్ డేటా ప్రకారం ప్లాటినం ఫ్యూచర్స్ $2,400కు పెరిగి సరికొత్త రికార్డులను సృష్టించింది. డిమాండ్ ఎక్కువ కావడం.. సరఫరా తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోవడానికి కారణం. దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య పెరిగిపోయిన ఉద్రిక్తతలు, అమెరికా ఆంక్షలు, వెనిజుల ఆయిల్ షిప్‌మెంట్స్, నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ టార్గెట్‌గా మిలిటరీ దాడులు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం లాంటి చాలా అంశాలు ప్లాటినం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఈయూ, చైనా ఇండస్ట్రీల నుంచి ప్లాటినం డిమాండ్ స్థిరంగా పెరుగుతుండటం కూడా మరో కారణం. రానున్న కాలంలో కూడా ప్లాటినం ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.