Nirmala Sitharaman Biography: మధురై నుంచి ఢిల్లీ వరకు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీవిత విశేషాలు!
తమిళనాడులోని మధురైలోని సావిత్రి, నారాయణన్ సీతారామన్ దంపతులకు 1959 ఆగస్టు 18న నిర్మలా సీతారామన్ జన్మించారు. ఆమె తండ్రి నారాయణన్ సీతారామన్ భారతీయ రైల్వే ఉద్యోగి. సీతారామన్ తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మద్రాసు, తిరుచిరాపల్లిలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కాలేజీలో అర్థశాస్త్రంలో బీఎ డిగ్రీ పూర్తి చేశారు. 1984లో ఢిల్లీ-జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఎమ్‌ఏ..

ఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను గురువారం (ఫిబ్రవరి 1) ఉదయం 11 గంటలకు సమర్పించనున్న సంగతి తెలిసిందే. ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టడం విశేషం. మంత్రి నిర్మలా విద్య, రాజకీయ జీవితం, జీతభత్యాలు వంటి విషయాలు చాలా మందికి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.
నిర్మలా సీతారామన్ బాల్యం- చదువు
తమిళనాడులోని మధురైలోని సావిత్రి, నారాయణన్ సీతారామన్ దంపతులకు 1959 ఆగస్టు 18న నిర్మలా సీతారామన్ జన్మించారు. ఆమె తండ్రి నారాయణన్ సీతారామన్ భారతీయ రైల్వే ఉద్యోగి. సీతారామన్ తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. మద్రాసు, తిరుచిరాపల్లిలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కాలేజీలో అర్థశాస్త్రంలో బీఎ డిగ్రీ పూర్తి చేశారు. 1984లో ఢిల్లీ-జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఎమ్‌ఏ, ఎకనామిక్స్‌లో ఎంఫిల్ పూర్తి చేశారు. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చదివేందుకు అడ్మిషన్ తీసుకున్నారు. కానీ మధ్యలోనే ఆ కోర్స్ వదిలేశారు. అయితే జేఎన్‌యూలో చదువుతున్న సమయంలో నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ మధ్య పరిచయం ఏర్పడింది. వీరు 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి వాంగ్మయి అనే కుమార్తె ఉంది. నిర్మల భర్త పరకాల ప్రభాకర్ కాంగ్రెస్ భావజాలం కలిగిన వ్యక్తి. ఇక నిర్మలా సీతారామన్ బీజేపీ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. ఆమె భర్త పరకాల ప్రభాకర్ నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేశారు. భిన్నమైన రాజకీయ భావజాలం ఉన్నప్పటికీ వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగుతోంది.
ఆయన అటు – ఆమె ఇటు
2006లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన నిర్మలా సీతారామన్ అనతికాలంలోనే.. అంటే 2010లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పగ్గాలు చేపట్టారు. 2014లో బీజేపీ విజయభావుటా ఎగురవేసింది. నాటి నరేంద్ర మోదీ కేబినెట్‌లో జూనియర్ మంత్రిగా నిర్మలా నియమితులయ్యారు. జూన్ 2014లో ఏపీ నుంచి, మే 2016లో కర్ణాటక స్థానం నుంచి పోటీ చేసి రాజ్యసభ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2017లో భారత రక్షణ మంత్రిగా ఆమె పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మంత్రిగా పదవిని చేపట్టిన రెండవ మహిళ నిర్మలా సీతారామన్ మాత్రమే. అంతేకాకుండా పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగిన మొదటి మహిళ కూడా నిర్మలా కావడం విశేషం.
ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నెల జీతం ఎంతో తెలుసా?
ఇక 2019లో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా నిర్మల నియమితులయ్యారు. ఆర్థిక మంత్రిగా తొలిసారి అదే సంవత్సరం జూలై 5న పార్లమెంటులో తన తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక అప్పటి నుంచి అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో నిర్మల సీతారామన్ ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక నిరమలా సీతారామన్ ఫోర్బ్స్ మ్యాగజైన్ 2019లో ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల్లో నిర్మలా 34వ స్థానంలో నిలిచింది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నెలకు రూ. 4 లక్షల వరకు జీతంగా పొందుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.