‘నా భార్య చచ్చిపోతోంది, ఆమెను అడ్మిట్ చేసుకోండి’, ఢిల్లీలో ఓ ఆసుపత్రి బయట ఓ భర్త వేడుకోలు
కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ.. దేశంలో అనేక నగరాల్లోని ఆసుపత్రుల వద్ద దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతుండగా బెడ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది.
కోవిడ్ మహమ్మారి కోరలు చాస్తున్న వేళ.. దేశంలో అనేక నగరాల్లోని ఆసుపత్రుల వద్ద దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. హాస్పిటల్స్ అన్నీ కోవిడ్ రోగులతో కిక్కిరిసిపోతుండగా బెడ్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. వందలాది బాధితులు ఆస్పత్రుల ఆవరణల్లోనే పడిగాపులు పడుతున్నారు. ఢిల్లీలోని అతి పెద్ద లోక్ నాయక్ జయప్రకాశ్ కోవిడ్ ఆసుపత్రి వద్ద గురువారం రోగులు, వారి బంధువులతో నిండిపోయింది. తమవారిని అడ్మిట్ చేయించుకోవాలంటూ అనేకమంది డాక్టర్లను, వైద్య సిబ్బందిని ప్రాధేయపడుతున్నారు. పడకలు లేవని చెప్పినా..ఏదో విధంగా సర్దుబాటు చేయాలంటూ దీనంగా అర్థిస్తున్నారు. ఇలాంటి వారిలో అస్లం ఖాన్ అనే వ్యక్తి ఆవేదన అందర్నీ కలిచివేసింది. 30 ఏళ్ళ తన భార్య రూబీ ఖాన్ కి కరోనా పాజిటివ్ సోకిందని, ఆమెను తన బైక్ పై కూర్చోబెట్టుకుని మూడు ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా అడ్మిట్ చేసుకోలేదని ఆయన వాపోయాడు. దీంతో ఈ ఆసుపత్రికి తీసుకువచ్చ్చానని తెలిపాడు. ‘ నా భార్య చచ్చిపోతోంది.. ఆమెను అడ్మిట్ చేసుకోండి’ అని కనబడిన వారినల్లా అర్థించాడు.
అటు-తాము లోగడ కరోనా టెస్టు చేయించుకున్నామని, నెగెటివ్ వచ్చిందని, అయినా ఇప్పుడు శ్వాస సరిగా తీసుకోలేక ఇబ్బందిపడుతున్నామని కొందరు తెలిపారు. కాగా- ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ తరుణంలో అత్యవసరంగా తమకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. కరోనా వైరస్ పరిస్థితిపై దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు..ఎన్నడూ లేని విధంగా కేంద్రంపై విరుచుకుపడింది. ఎలాగైనా ఆక్సిజన్ కొరతను తీర్చాలని, రోగులందరికీ ఆక్సిజన్ అందేలా చూడాలని సూచించింది. పైగా ‘ఆక్సిజన్ కోసం అడుక్కోండి..ఎక్కడినుంచయినా అప్పు మాదిరి ఆక్సిజన్ తీసుకురండి.. చివరకు దొంగిలించి అయినా సరే..ఈ కొరతను తీర్చండి’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో 200 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామందికి ఆక్సిజన్ అవసరం. అయితే ఈ ప్రాణవాయువు తగినంతగా లేకపోవడంతో ఈ ఆసుపత్రి చేతులెత్తేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: AP Corona : కరోనా రోగులకు పడకలు, ఆక్సిజన్, వైద్యుల నియామకంపై ఏపీ మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు