Monsoon Disaster: హిమాచల్లో మేఘాల విస్ఫోటనం.. విరిగిపడిన కొండచరియలు.. అడవుల్లోకి పారిపోయిన ప్రజలు..
హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని నిచార్‌లో మేఘాల విస్ఫోటనం విధ్వంసం సృష్టించింది. భారీ వర్షం, నీటి ప్రవాహంలో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్ళు దెబ్బతిన్నాయి. భారీ వర్షం వలన కొండచరియలు విరిగిపడటం వలన రాష్ట్రంలోని 606 రోడ్లను మూసివేశారు. రహదారుల మీద ఇప్పటికీ నిలిచిపోయాయి. వాటిలో రెండు జాతీయ రహదారులు ఉన్నాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో మరోసారి మేఘాల విస్ఫోటనం సంభవించింది. కిన్నౌర్‌లోని నిచార్‌లో సంభవించిన మేఘాల విస్ఫోటనం విధ్వంసం సృష్టించింది. వరదల ధాటికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించింది. ప్రమాదాన్ని గ్రహించిన గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి సమీపంలోని అడవిలోకి పారిపోయి అక్కడ ఆశ్రయం పొందారు.
ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం రాత్రి సమయంలో అకస్మాత్తుగా మేఘాలు విస్ఫోటనం చెందాయి. కొద్దిసేపటికే వాగులు, నీటి వనరులు పొంగిపొర్లాయి. రోడ్లు, గ్రామాలలోకి నీరు, శిథిలాల వరద ప్రవేశించింది. ఈ విపత్తు ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. మరికొన్ని వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. రోడ్లపై భారీగా శిథిలాల కారణంగా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పరిపాలన, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలను ప్రారంభించాయి.
606 రోడ్లు దిగ్బంధం.. రెండు జాతీయ రహదారులు ప్రభావితం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో సాధారణ జనజీవనాన్ని దెబ్బతీశాయి. రాష్ట్ర అత్యవసర ఆపరేషన్స్ సెంటర్ (SEOC) ప్రకారం ఇప్పటివరకు మొత్తం 606 రోడ్లు మూసివేశారు. వీటిలో రెండు జాతీయ రహదారులు, NH-3 (అట్టారి-లేహ్ రోడ్), NH-503A (అమృత్సర్-భోటా రోడ్) ఉన్నాయి. కులు జిల్లాలో అత్యధికంగా 203 రోడ్లు మూసివేయబడ్డాయి. తరువాత మండిలో 198 రోడ్లు, సిమ్లా 51రోడ్లు ఉన్నాయి.
వాతావరణ శాఖ హెచ్చరిక
రానున్న రోజుల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సిమ్లా, కాంగ్రా, పాలంపూర్, మురారి దేవి, సుందర్‌నగర్‌లలో ఇటీవల ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి, టాబో , బజౌరాలో గంటకు 33 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. నదులు, వాగులు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు నివాసితులను కోరారు.
ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు రాష్ట్రంలో 46 మేఘావృతాలు, 98 ఆకస్మిక వరదలు,146 పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విపత్తులు, రోడ్డు ప్రమాదాలలో 424 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో భారీ వర్షాలకు సంబంధించిన సంఘటనలతో 242 మంది మృతి చెందగా, రోడ్డు ప్రమాదాలతో 182 మంది మరణించారు. అదనంగా 481 మంది గాయపడ్డారు. 45 మంది ఆచూకీ ఇప్పటికీ కనిపించలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








