ఓట్ల తొలగింపుపై రాహుల్ ఆరోపణలు అర్ధరహితం.. ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపు అసాధ్యం: ఈసీ
రాహుల్‌గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణలపై వివాదం మళ్లీ రాజుకుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్‌గాంధీ ఆరోపణలకు ఆధారాలు లేవని , అర్ధరహితమని ఈసీ కొట్టిపారేసింది.

రాహుల్‌గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణలపై వివాదం మళ్లీ రాజుకుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్‌గాంధీ ఆరోపణలకు ఆధారాలు లేవని , అర్ధరహితమని ఈసీ కొట్టిపారేసింది.
రాహుల్‌గాంధీ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. రాహుల్ ఆరోపణలు అవాస్తవమని, అర్ధరహితమంటూ ఈసీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపు అసాధ్యమని తేల్చి చెప్పింది ఈసీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని అలంద్‌లో ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరిగాయని, దీనిపై ఈసీ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించింది. అలంద్ సీటులో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ పార్టీలు గెలిచాయని ఈసీ వెల్లడించింది.
ఇదిలావుంటే, కేంద్ర ఎన్నికల సంఘంపై విపక్ష నేత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ చోరీ చేస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటు చోరీ చేస్తున్న వారిని CEC జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని ఆరోపణలు చేశారు.
ఓట్ల చోరీ కేంద్రీకృతంగా జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. మహారాష్ట్ర రాజురాలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారని, కర్ణాటక అలంద్‌లో గోదాబాయ్ పేరుతో 18 ఓట్లు తొలగించారని అన్నారు రాహుల్. ఫేక్ లాగిన్ ఐడీలతో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగించారని ఆరోపించారు. కర్ణాటకలో ఓట్ల తొలగింపు కోసం వివిధ రాష్ట్రాల ఫోన్ నెంబర్లు వాడారని అన్నారు. కర్ణాటక సీఐడి18 సార్లు అడిగినా ఈసీ ఓట్ చోరీ విరాలు ఇవ్వలేదన్నారు. వారంలోగా కర్నాటక సీఐడీ అడిగిన ఆధారాలు ఈసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌గాంధీ ఆరోపణలు బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. హైడ్రోజన్ బాంబుతో ధమాఖా పేలుస్తానన్న రాహుల్‌గాంధీ డ్రామా ఆడి వెళ్లిపోయారని విమర్శించారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను రాహుల్ బలహీనపర్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈసీ లాంటి రాజ్యాంగ బద్ద సంస్థలపై తరచుగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే రాహుల్ కోర్టుకు ఇవ్వాలన్నారు అనురాగ్ ఠాకూర్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి..




