AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో అత్యధిక మెజార్టీ ఆయనదే.. మరీ అతి స్వల్ప మెజార్టీ ఎవరిదంటే..?

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, బీజేపీ పార్టీ 8 సీట్లు, ఎఐఎంఐఎం ఒక స్థానం గెలుచుకుంది. అందులో చాలా మంది అభ్యర్థులు తమ ప్రత్యర్థుల మీద భారీ మెజార్టీతో గెలుపొందారు. మరికొంత మంది స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుకుకోగా, అత్యల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయ తీరాలకు చేరారు.

Telangana: తెలంగాణలో అత్యధిక మెజార్టీ ఆయనదే.. మరీ అతి స్వల్ప మెజార్టీ ఎవరిదంటే..?
Highest And Lowest Majorities List In Telangana
Balaraju Goud
|

Updated on: Jun 04, 2024 | 10:52 PM

Share

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, బీజేపీ పార్టీ 8 సీట్లు, ఎఐఎంఐఎం ఒక స్థానం గెలుచుకుంది. అందులో చాలా మంది అభ్యర్థులు తమ ప్రత్యర్థుల మీద భారీ మెజార్టీతో గెలుపొందారు. మరికొంత మంది స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుకుకోగా, అత్యల్ప మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయ తీరాలకు చేరారు.

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈసారి తొలిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్న వారే అత్యధిక మెజార్టీ సాధించడం విశేషం. ఇందులో కాంగ్రెస్ నుంచి గెలిచిన కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కావ్య, రామ సహాయం రఘురాం రెడ్డి బీజేపీ నుంచి గెలిచిన రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, డికె అరుణ, గడ్డం వంశీకృష్ణ ఉన్నారు. అవకాశం వచ్చిన తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెడుతున్నారు.

అయితే అత్యధిక మెజార్టీతో గెలుపొందింది.. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చింది. ఏకంగా ఐదులక్షల 60వేలకు పైగా అధిక్యంతో ప్రభంజనం సృష్టించారు. తెలంగాణ చరిత్రలోనే భారీ మెజార్టీ సాధించి రికార్డ్ సృష్టించారు రఘువీర్ రెడ్డి. మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ పార్లమెంట్‌పై స్పెషల్ కేర్ తీసుకున్నారు. దేశంలోనే నల్గొండ సెగ్మెంట్లో భారీ అధిక్యత సాధిస్తామని ముందు నుంచి చెప్తున్నారు. బరాబర్ ఐదులక్షల మార్క్ క్రాస్ చేస్తామని సవాల్ చేశారు. పార్టీ సభ్యత్వంలో ఈ ఎంపీ సెగ్మెంట్ మొదటి స్థానంలో ఉందని అదే జోష్‌తో విక్టరీ కొడతామని చెప్పి తమ సత్తా ఏంటో నిరూపించారు.

ఇక ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘురాం రెడ్డి సైతం భారీ మెజార్టీ గెలుపొందారు. ఆయన తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 4,67,847 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌ రెడ్డిపై 3,91,4753 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌ తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితపై 3.49 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో ఎఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ 3,38,087 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 2,25,209 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి 2,22,170 ఓట్ల తేడాతో విజయఢంకా మోగించారు. వరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య 2,20,339 ఓట్ల తేడాతో రికార్డు విజయం నమోదు చేసుకున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డిపై దాదాపు 1,72,897 ఓట్ల మెజార్టీ సాధించారు. ఇక పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

నిజామాబాద్‌ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. నాగర్‌కర్నూలులో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి బీజేపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ పోతుగంటిపై 94,414 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ సీటు నుంచి బీజేపీ అభ్యర్థి నగేష్‌ 90,652 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేష్‌ షెట్కార్‌ తన సమీప బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌పై 46,188 ఓట్ల తేడాతో గెలుపొందారు. సికింద్రాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు తన సమీప ప్రత్యర్థిపై 39,139 పైచీలుకు ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు.

మహబూబ్‌నగర్‌లో జరిగిన ఉత్కంఠ పోరులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డిపై స్వల్ప ఆధిక్యంతోనే విజయం సాధించారు. రౌండ్‌ రౌండ్‌కు ఆధిక్యాలు మారడంతో నెలకొన్న ఉత్కంఠ పోరులో డీకే అరుణ కేవలం 4,500 ఓట్లతో గట్టెక్కారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…