Karnataka Elections: కన్నడ పీఠం ఎవరిదీ..? కర్ణాటకలో ముగిసిన హైఓల్టెజ్ ప్రచారం.. పోటీలో ఎంతమంది ఉన్నారంటే..?
బుధవారం జరిగే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రచారంలో ప్రధాన పార్టీల కీలక నేతలందరూ ప్రచారం చేశారు. బరిలో అనేక పార్టీలు ఉన్నా గతంలో మాదిరిగానే ఈసారి కూడా కర్నాటకలో ముక్కోణపు పోటీనే నెలకొంది.
2024 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎనిమిదికి పైగా పార్టీలు బరిలో ఉన్నా ప్రధాన పోటీ మధ్య కాంగ్రెస్, బీజేపీ, JDS మధ్య నెలకొంది. పోటాపోటీగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా, కాంగ్రెస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు JDS తరపున కుమారస్వామి, దేవేగౌడ ప్రయత్నించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 2615 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 2430 మంది పురుషులు, 184 మంది స్త్రీలు, థర్డ్ జెండర్ వ్యక్తి ఒకరు ఉన్నారు. మొత్తం 224 స్థానాల్లో బీజేపీ తన అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో పోటీ చేస్తోంది. మేల్కొటే అసెంబ్లీ నియోజకవర్గంలో సర్వోదయ కర్నాటక పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన JDS 207 స్థానాల్లో పోటీ పడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 209 స్థానాల్లో BSP 133 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బరిలో సీపీఎం, JDU, NPP పార్టీలు కూడా ఉన్నాయ. 16 నియోజకవర్గాల్లో 15 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బుధవారం ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కర్నాటకవ్యాప్తంగా 58 వేల 545 పోలింగ్ బూత్‌లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ దఫా కర్నాటకలో 5 కోట్ల 31లక్షల 33 వేల 54 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 11 లక్షల 71 వేల మంది తొలిసారి ఓటు వేస్తున్న వారు ఉన్నారు. అటు 80 ఏళ్లు పైబడిన ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని తొలిసారి ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో కల్పించింది. రిజిస్టర్ చేసుకున్న ఓటర్లలో 97 శాతం మంది ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 80వేల250 మంది ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేసేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 75,690 మంది ఓటు వేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వెయ్యి మంది పోలీసులు, వెయ్యి మంది హోంగార్డులు, తెలంగాణ నుంచి 516 మంది పోలీసులు, 684 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వం అవినీతి పాల్పడిందంటూ కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం సాగించింది. మరో వైపు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను బీజేపీ తన అస్త్రాలుగా మార్చుకుంది. కర్నాటక డెయిరీ నందిని, బజరంగ్‌దళ్ నిషేధం ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాంశాలుగా మారాయి. మరో వైపు ప్రచారం చివరి ఘట్టంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. కర్నాటక గౌరవం, సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలుగనీయమనే మాటలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమెపై FIR నమోదు చేయాలని ఎన్నికల సంఘాన్ని కేంద్ర మంత్రి శోభా కరాంద్లజే కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..