PMUY: ఉజ్వల యోజనతో విప్లవాత్మక మార్పులు.. ఒకప్పుడు పొగతో ఊపిరాడని ఇళ్లు.. ఇప్పుడు వెలుగులతో ధగధగ
దేశంలోని పేద మహిళల వంటగదుల్లో పొగల బదులు ఇప్పుడు వెలుగులు మెరిసిపోతున్నాయి. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనతో కోట్లాది కుటుంబాలు ఎల్‌పీజీ సౌకర్యం పొందాయి. గ్యాస్ వాడకంతో గృహ వాయు కాలుష్యం తగ్గి, మహిళల ఆరోగ్యం మెరుగుపడింది. వంటగదిలోనే కాదు, జీవనశైలిలోనూ ‘ఉజ్వల’ మార్పు కనిపిస్తోంది.

దేశంలో పేద మహిళల జీవితాల్లో ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (PMUY) విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. వంటగదిలో గాలి నిండా పొగ చూరే రోజులు మాయమవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ మంటతో వెలుగులు నిండుతున్నాయి. 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ లక్ష్యం దేశ వ్యాప్తంగా ప్రతి పేదింటికీ శుభ్రమైన ఇంధనం అందించడం. 2023 నాటికి ఈ పథకం కింద కోటికి పైగా పేద కుటుంబాలు ఎల్‌పీజీ సౌకర్యం పొందాయి.
ఎలా పనిచేస్తుంది ఈ యోజన..?
పేద మహిళల పేర్లతో ఎల్‌పీజీ కనెక్షన్ ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. మొదటి సిలిండర్, గ్యాస్ స్టౌ, రెగ్యులేటర్ వంటి ప్రారంభ ఖర్చులు అన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. అంతేకాక సబ్సిడీ రూపంలో ప్రతి సిలిండర్ ఖర్చులో కొంత భాగం తిరిగి మహిళల ఖాతాలో జమ అవుతుంది. సామాజిక అవగాహన కార్యక్రమాలు, గ్రామ గ్రామాన పంపిణీ కేంద్రాలు ఈ రెండూ కలిపి LPG వినియోగాన్ని బాగా పెంచాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు 95 శాతం పైగా గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నాయి. గ్రామీణ కుటుంబాల్లో ఎల్‌పీజీ వాడకం మూడింతలు పెరిగింది. ఆరోగ్యం, పర్యావరణం, స్త్రీ సాధికారత.. ఇలా ఈ ప్రాజెక్ట్‌తో 3 లక్షాలు నెరవేరుతున్నాయి. పొయ్యి పొగతో ఇళ్లు నిండిపోయే కాలం వెళ్లిపోయింది. ఉజ్వల యోజన వల్ల దేశంలో గృహ వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది.
ఆరోగ్య పరంగా:
చెక్కలు, బొగ్గు, కట్టెలతో వంట చేసే కుటుంబాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటాయి. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు ఇవన్నీ పెరిగే ప్రమాదం ఉంటుంది. నిపుణుల అంచనా ప్రకారం.. ఎల్‌పీజీని పూర్తిగా వాడితే ప్రతి సంవత్సరం సుమారు 1.5 లక్షల ప్రాణాలు కాపాడవచ్చు. ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టే శిశువుల మరణాలు తగ్గుతాయి.
పర్యావరణ పరంగా:
చెక్కల వంట పొయ్యిల నుంచి వచ్చే పొగతో దేశంలో సుమారు 30 శాతం వాయు కాలుష్యం (PM2.5) ఏర్పడుతుంది. గ్యాస్ వాడకం పెరగడం వల్ల ఈ కాలుష్యం తగ్గి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గాలి నాణ్యత ప్రమాణాల వైపు భారత్ వేగంగా పరుగులు తీస్తుంది.
స్త్రీ సాధికారత:
పేద మహిళల పేర్లతో కనెక్షన్లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మహిళలను కుటుంబానికి ఇంధన అధిపతులుగా నిలిపింది. పొయ్యి పొగతో కళ్లనీరు కార్చే మహిళలు ఇప్పుడు స్వయంగా గ్యాస్ వెలిగిస్తున్నారు.
ఇంకా ఉన్న సవాళ్లు:
ఉజ్వల యోజనతో గ్యాస్ చేరింది కానీ ప్రతి ఇల్లు పూర్తిగా ఎల్‌పీజీ వైపు ఇంకా అడుగులు వేయలేదు. కొంతమంది ఖర్చు భరించలేక మళ్లీ కట్టెలపై వంట చేస్తున్నారు. అందుకే గ్యాస్ ధరలు, సబ్సిడీ విధానం మరింత ప్రజానుకూలంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 2030 నాటికి ప్రతి ఇంటికీ శుభ్రమైన వంట ఇంధనం అందించాలన్న సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ (SDG 7.1) లక్ష్యానికి ఇది కీలక అడుగుగా పరిగణిస్తున్నారు.
ఉజ్వల యోజన కేవలం వంటగదిని మార్చలేదు. జీవన శైలినే మార్చింది. పొగలతో నిండిన ఆవరణలు ఇప్పుడు కాంతితో మెరిసిపోతున్నాయి. మహిళల చిరునవ్వుల్లో కొత్త ఉజ్వల కాంతి కనిపిస్తోంది..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




