Delhi Election 2024: దేశ రాజధానిలో సత్తా చాటేదెవరు.. గణాంకాలు ఏం చెబుతున్నాయి..?

ఎన్నికల రాజకీయాల్లో సీట్లు మొత్తం ఒకే పార్టీ గెలుచుకునే సందర్భాలు అరుదుగా చోటుచేసుకుంటాయి. దేశానికి పాలనా కేంద్రం ఢిల్లీ విషయంలో మాత్రం గత 3 పర్యాయాలుగా ఏదైనా ఒక పార్టీనే మొత్తం సీట్లన్నీ కైవసం చేసుకుంటూ వస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతానికి ఎక్కువ, పూర్తిస్థాయి రాష్ట్రానికి తక్కువ అన్న స్థితిలో ఉన్న ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.

Delhi Election 2024: దేశ రాజధానిలో సత్తా చాటేదెవరు.. గణాంకాలు ఏం చెబుతున్నాయి..?
Modi Kajriwal Rahul
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 23, 2024 | 11:30 AM

ఎన్నికల రాజకీయాల్లో సీట్లు మొత్తం ఒకే పార్టీ గెలుచుకునే సందర్భాలు అరుదుగా చోటుచేసుకుంటాయి. దేశానికి పాలనా కేంద్రం ఢిల్లీ విషయంలో మాత్రం గత 3 పర్యాయాలుగా ఏదైనా ఒక పార్టీనే మొత్తం సీట్లన్నీ కైవసం చేసుకుంటూ వస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతానికి ఎక్కువ, పూర్తిస్థాయి రాష్ట్రానికి తక్కువ అన్న స్థితిలో ఉన్న ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి తదుపరి జరగబోయే 6వ విడత ఎన్నికల్లో పోలింగ్ జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పూర్తిగా పట్టణ రాష్ట్రంగా ఉన్న ఢిల్లీలో 2009లో మొత్తం సీట్లన్నీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, 2014కు వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్సైంది. ఆ ఎన్నికల్లో 46.40% ఓట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ (BJP) ఢిల్లీలోని 7 సీట్లు గెలుచుకుంది. 2019లో మరోసారి అన్ని సీట్లనూ గెలుచుకుని తన పాత రికార్డును సమం చేసింది. ఈసారి మరింత బలం పెంచుకుని 56.86% ఓట్లు సాధించింది. ఈ పరిస్థితుల్లో మే 25న జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తన పాత రికార్డును సమం చేస్తుందా అన్నదే ఒక పెద్ద సవాలుగా మారింది. ఇందుకు కారణంగా పదేళ్ల పాలనలో సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో కమలదళానికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలన్నీ ఏకమవడంతో పోటీ రసవత్తరంగా మారింది.

కాంగ్రెస్‌ను కబళిస్తున్న ఆప్

మోదీ – షా ద్వయం అధికారపగ్గాలు చేపట్టిన అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ (BJP) దేశవ్యాప్తంగా నానాటికీ బలపడుతూ వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా బలహీనపడుతూ వచ్చింది. ఈ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో క్రమక్రమంగా బలహీనపడింది. 2009లో ఆ పార్టీ 57.11% ఓట్లను సాధించిన చరిత్ర ఉన్నప్పటికీ.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ తన ఉనికి చాటుకోవడమే కష్టంగా మారింది. ఆ పార్టీ బలం 2014 నాటికి 42.01% కు తగ్గగా.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రవేశం అనంతరం జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 22.51% కు పడిపోయింది. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 18.11% ఓట్లు సాధించింది. ఈ రెండు పార్టీలను మించి బీజేపీకి ఏకపక్షంగా 56 శాతానికి పైగా ఓట్లు రావడం వల్ల ప్రత్యర్థులెవరూ కనీస పోటీ ఇవ్వలేకపోయారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 5 చోట్ల కాంగ్రెస్ ద్వితీయ స్థానంలో నిలవగా, రెండు చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నార్త్ వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీలో రన్నరప్‌గా నిలిచింది.

మొత్తమ్మీద గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. శతాబ్దానికి పైగా చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ మెల్లమెల్లగా కబళిస్తోందని అర్థమవుతోంది. ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేతి నుంచి అధికారాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ హస్తగతం చేసుకుంది. గుజరాత్, గోవా వంటి రాష్ట్రాలు సహా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిన అన్ని చోట్లా కాంగ్రెస్ ఓటుబ్యాంకుకే గండి పెడుతూ వచ్చింది. అయితే ఏ పార్టీతో తన అస్థిత్వానికి, ఉనికికి ప్రమాదం ఏర్పడిందో.. ఆ పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జతకట్టింది. ఢిల్లీలోని 7 స్థానాల్లో మెజారిటీ స్థానాలు (4) ఆప్‌కు కట్టబెట్టి, 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది.

ఏ స్థానంలో ఎవరు?

పూర్తిగా పట్టణ ప్రాంతమైన ఢిల్లీ రాష్ట్రంలో 7 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. న్యూఢిల్లీతో పాటు చాందినీ చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ పేరుతో నియోజకవర్గాల విభజన జరిగింది. వీటిలో చాందినీచౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా, మిగతా నాలుగు చోట్ల ఆప్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ సారథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పేరుతో కూటమి ఉన్నప్పటికీ ఢిల్లీలో మిత్రపక్షం ఎవరూ లేకపోవడంతో అన్ని స్థానాల్లో బీజేపీయే నేరుగా బరిలో ఉంది. అయితే 2019తో పోల్చితే ఈసారి అభ్యర్థులను మార్చింది. చాందినీ చౌక్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న డా. హర్షవర్ధన్‌ను తప్పించి, ఆ స్థానంలో ప్రవీణ్ ఖండేల్వాల్‌కు టికెట్ ఇచ్చింది. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి జైప్రకాశ్ అగర్వాల్ బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ డా. హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ప్రధాని మోదీ ఆయన పనితీరుపై అసంతృప్తితో కేబినెట్ నుంచి తొలగించారు. ఇప్పుడు ఏకంగా టికెట్ కూడా నిరాకరించారు.

నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీని పార్టీ కొనసాగించింది. భోజ్‌పురి గాయకుడిగా ఉత్తరాదివారికి సుపరిచితుడైన మనోజ్ తివారీ బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయనపై పోటీకి కాంగ్రెస్ పార్టీ కన్నయ్య కుమార్‌ను బరిలోకి దించింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో జరిగిన విద్యార్థి సంఘాల ఘర్షణలతో పాపులరైన కన్నయ్య కుమార్, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బిహార్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి మనోజ్ తివారీని ఢీకొడుతున్నారు. దీంతో ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌ను బీజేపీ అధిష్టానం తప్పించి హర్ష్ మల్హోత్రాకు టికెట్ ఇచ్చింది. నిజానికి గౌతమ్ గంభీర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో లేరన్న విమర్శ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన్ను మర్యాదపూర్వకంగా రాజకీయాలకు స్వస్తి చెప్పినట్టుగా ప్రకటన చేయించింది. తర్వాత అభ్యర్థిని మార్చింది. ఈ స్థానంలో బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్‌దీప్ కుమార్ ఢీకొడుతున్నారు.

రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, సుప్రీంకోర్టు సహా కేంద్ర ప్రభుత్వ పాలనలో భాగమైన భవనాలన్నీ ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో గత పదేళ్లుగా ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని అధిష్టానం తప్పించింది. ఆమె స్థానంలో దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె భాన్సురి స్వరాజ్‌కు అవకాశం కల్పించింది. మీనాక్షి లేఖి వ్యవహారశైలిపై విమర్శలు, పార్టీ అంతర్గత సర్వేల్లో విజయావకాశాలు లేకపోవడం వంటి కారణాలతో ఆమెను తప్పించినట్టు తెలిసింది. భాన్సురిపై ఆప్ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతి పోటీ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన సోమ్‌నాథ్ భారతి విజయం కోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దీంతో ఈ నియోజకవర్గంలో కూడా పోటీ రసవత్తరంగా మారింది.

నార్త్ వెస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో కూడా బీజేపీ అగ్రనాయకత్వం అభ్యర్థిని మార్చింది. సిట్టింగ్ ఎంపీ హన్స్‌రాజ్‌ను తప్పించి ఆయన స్థానంలో యోగేందర్ చందోలియాకు అవకాశం ఇచ్చింది. యోగేందర్‌పై కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదిత్ రాజ్ పోటీ చేస్తున్నారు. ఉదిత్ రాజ్ 2014లో ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ స్థానం నుంచి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దించింది.

వెస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ పర్వేశ్ వర్మను తప్పించి ఆయన స్థానంలో కమల్‌జీత్ సెహ్రావత్‌కు కమలదళం అవకాశం ఇచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల వ్యవహారాన్ని వెలికితీయడంలో పర్వేశ్ వర్మ కీలకంగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా మూడింట ఒక వంతు అభ్యర్థులను మార్చిన బీజేపీ, ఈ స్థానంలోనూ పర్వేశ్ వర్మను తప్పించింది. ఆయనపై ఆమ్ ఆద్మీ మహాబల్ మిశ్రాను బరిలోకి దించింది.

వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీకి అపకీర్తి తెస్తున్నాడన్న అభియోగాలపై సౌత్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ రమేశ్ బిధూరిని తప్పించి, ఆయన స్థానంలో రామ్‌వీర్ సింగ్ బిధూరికి అవకాశం కల్పించింది. అంటే ఒక్క నార్త్ ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీకి తప్ప మరెవరికీ మరోసారి కొనసాగే అవకాశాన్ని పార్టీ ఇవ్వలేదు. రామ్‌వీర్ సింగ్ బిధూరిపై ఆప్ అభ్యర్థి సాహి రామ్ పెహల్వాన్ పోటీ చేస్తున్నారు.

మొత్తమ్మీద రాష్ట్రంలోని 7 నియోజకవర్గాల్లో 6 చోట్ల సిట్టింగ్ ఎంపీలను మార్చిన బీజేపీ, ఈసారి విపక్ష కూటమి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. పదేళ్ల పాలనలో సహజంగా ఏర్పడే వ్యతిరేకతకు తోడు, ఈ రెండు పార్టీల ఓటుబ్యాంకు జతకావడం కమలదళానికి సవాలుగా మారింది. మరోవైపు బయోమెట్రిక్ అటెండెన్స్ సహా ప్రభుత్వ ఉద్యోగులతో నడుం వంచి పనిచేయిస్తున్నందుకు ఎన్డీఏ సర్కారుపై ఆయా వర్గాలకు కోపమే ఉంటుంది. అయితే ప్రపంచపటంపై భారతదేశ ప్రతిష్టను పెంచడం, కొత్త పార్లమెంట్ భవనం సహా సెంట్రల్ విస్టాలోని భవనాలన్నింటినీ తొలగించి కొత్తవి నిర్మించడం, మౌలిక వసతుల కల్పన, ఆర్థిక వృద్ధి వంటి అంశాలతో ఏకీభవించే విద్యావంతులు తమకు ఓటు వేస్తారని కమలదళం భావిస్తోంది. పెరిగిన ధరలు, నిరుద్యోగ సమస్య వంటివి తమకు కలిసొచ్చే అంశాలుగా విపక్ష కూటమి నేతలు భావిస్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చి స్థిరపడ్డ ప్రజలతో ఉన్న మెట్రోపాలిటన్ నగరంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరుపక్షాలు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి. ఈ పోరులో గెలుపెవరిది అన్నది ఉత్కంఠ కల్గిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో చెప్పిన సల్మాన్ తండ్రి
కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
కల్కితో థియేటర్‌ హంగామా చేసిన ప్రభాస్ పెద్దమ్మ
తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
తన యాక్టింగ్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న దుల్కర్ సల్మాన్
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
అడవిలో తప్పిపోయిన వ్యక్తి .. ఎలా బయటపడ్డాడంటే ??
చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..
చిన్నారి NTR క్లాసికల్ డ్యాన్స్‌.. ఇదిగో వీడియో..
కొంపముంచిన రీల్స్ సరదా.. కార్లతో సముద్రంలో చిక్కుకున్న యువకులు..!
కొంపముంచిన రీల్స్ సరదా.. కార్లతో సముద్రంలో చిక్కుకున్న యువకులు..!
గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌.!
గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌.!
కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
కల్కి షో రద్దు.. థియేటర్ మేనేజర్‌కు ఇచ్చిపడేసిన ఫ్యాన్.. వీడియో.
ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్
ఇంటర్నెట్లోకి అప్పుడే వచ్చేసిన కల్కి Full HD ప్రింట్. ఫాన్స్ షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్
కల్కి క్లైమాక్స్‌ చూస్తే.. ఎగ్జైట్మెంట్‌తో అందరూ చేసిన పనికి షాక్