Bhagwant Mann: పంజాబ్ సీఏంకు ఝలక్ ఇచ్చిన కార్ల కంపెనీ BMW.. ఆప్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఫైర్..
తమ రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా పంజాబ్ లో జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల..
Bhagwant Mann: తమ రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ జర్మనీలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా పంజాబ్ లో జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మ్యానిఫ్యాక్చర్ యూనిట్ ని ప్రారంభించనుందని, పంజాబ్‌లో తమ ఆటో విడిభాగాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సెప్టెంబర్ 13వ తేదీ మంగళవారం జర్మనీలోని BMW ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని . అక్కడ సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపిన సీఏం, పంజాబ్ లో మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలతో పాటు అనుమతులను త్వరితగతిన మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని బీఎండబ్ల్యూ సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ కూడా ఈఅంశంపై మాట్లాడుతూ.. ఈనిర్ణయం రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి పెద్ద పీట వేస్తుందని, యువతకు కొత్త ఉపాధి మార్గాలను అందిస్తుందని తెలిపారు.
సీఏం ప్రకటన చేసిన ఒక్కరోజులోనే BMW కంపెనీ సీఏం భగవత్ మాన్ కు ఝలక్ ఇచ్చింది. భారత్ లోని పంజాబ్ లో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ అదనపు తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసే ఆలోచన లేదని కంపెనీ స్వయంగా ప్రకటించింది. BMW తన యూనిట్ ను ఏర్పాటుచేయడనుందని సీఏం ప్రకటించిన ఒక్కరోజులోనే సంబంధిత కంపెనీ అలాంటి ఆలోచన లేదని.. అటువంటి చర్చలు జరగలేదని చెప్పడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
ఈవిషయంలో పంజాబ్ లోని ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేశాయి. కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదల్ తో సహా అన్ని పార్టీలు సీఏం భగవత్ మాన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రజలను ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి.. వారిని తప్పుదోవ పట్టించడం ఆమ్ ఆద్మీ పార్టీకి అలవాటేనంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. లేని దానిని ఉన్నట్లుగా క్లెయిమ్ చేసుకోవడం పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బీజేపీ నేత తరుణ్ చుగ్ విమర్శించారు.పంజాబ్ లో పెట్టుబడులు ఆకర్షించడానికి కాకుండా సీఏం భగవత్ మాన్ ప్రయివేటు పర్యటనకు జర్మనీ వెళ్లారని ఆయన ఆరోపించారు. మరోవైపు పంజాబ్ శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత పర్తాప్ సింగ్ బజ్వా కూడా సీఏం భగవత్ మాన్ వైఖరిని తప్పుబట్టారు. రాష్ట్రం మొత్తానికి సీఏం అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. ఈవిషయం ఇప్పుడు పంజాబ్ రాజకీయాల్లో కాకరేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..