Cyclone Mocha: పెను తుఫానుగా మారి దూసుకొస్తున్న ‘మోచా’ సైక్లోన్.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..
మోచా తుఫాను శరవేగంతో దూసుకొస్తోంది. ఓ పక్క ఎండలు..మరో వైపు తుఫాను.. జనాన్ని హడలెత్తిస్తున్నాయి తాజా వాతావరణ పరిస్థితులు. ఈశాన్య రాష్ట్రాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని, గంటకి 120 కి.మీట వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మోచా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మోచా తుఫానుగా మారి, ఉత్తర వాయవ్య దిశగా కదులుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది. మోచా తుఫాను ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాల్లో మోఖా తుఫాను ప్రభావంతో భీకర వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రొలాజికల్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. మోచా తుఫాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో తీవ్ర వర్షపాతం నమోదవనుంది. అయితే ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలకు తుఫాను ముప్పు తప్పినట్టేనని ఐఎండీ వెల్లడించింది. మోచా తుఫాను ఈనెల 14 వ తేదీన బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దుల్లో తీరాన్ని దాటనుంది. తీరం దాటే సమయంలో 150 నుంచి 175 కి.మీ వేగంతో తీవ్రమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ఇండియన్ మెట్రొలాజికల్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది.
ఆ తరువాత తుఫాను బలహీనపడుతూ త్రిపుర, మిజోరాం మీదుగా మణిపూర్, దక్షిణ అస్సాం, నాగాలాండ్ వరకు మోఖా తుఫాను ప్రభావం చూపనుంది. దీంతో ఈనెల 14 వరకు ఆయా రాష్ట్రాల్లో భీకర వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. త్రిపుర, మిజోరాం, దక్షిణ మణిపూర్‌పై కూడా ఈదురు గాలుల ప్రభావం ఉండనుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీచేశారు వాతావరణ శాఖ అధికారులు. బలహీన నిర్మాణాలు, పూరి గుడిసెలు దెబ్బతినే అవకాశం ఉండడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని సూచించారు.
తుఫాను కారణంగా ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. గరిష్టంగా గంటకు 120 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు కొంకణ్ తీరంతో పాటు కేరళ, తమిళనాడులలో రానున్న 5 రోజుల పాటు వాతావరణం తీవ్ర ఉక్కపోతగా ఉండనుంది. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు రాజస్థాన్, కోస్తా ఆంధ్రా, యానాం ప్రాంతాల్లో హీట్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 15 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రకటించింది.
Deep Depression lay centered near 10.8 N and 88.2 E, about 500 km west-southwest of Port Blair, 1250 km south-southwest of Cox s bazaar (Bangladesh) at 2330 hrs IST of today the 10th May. To intensify gradually into a cyclonic storm by early morning of today the 11th May. pic.twitter.com/sQzZp9l6Tj
— India Meteorological Department (@Indiametdept) May 10, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..