PM Modi: దూసుకువస్తున్న బిపోర్‌జాయ్.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రధాని మోడీ ఆదేశం..
Cyclone Biparjoy News: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాను అతి తీవ్రంగా మారి గుజరాత్ రాష్ట్రం వైపు దూసుకువస్తోంది. బిపోర్‌జాయ్ అతి తీవ్ర తుపానుగా మారడంతో తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
Cyclone Biparjoy News: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాను అతి తీవ్రంగా మారి గుజరాత్ రాష్ట్రం వైపు దూసుకువస్తోంది. బిపోర్‌జాయ్ అతి తీవ్ర తుపానుగా మారడంతో తీర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఈ తుపాను మరో 36 గంటల్లో మరింత బలపడి గుజరాత్‌లోని కచ్, పాకిస్తాన్‌లోని కరాచీల మధ్య ఈ నెల 15న తీరాన్ని దాటనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో గుజరాత్ సహా పలు తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే తుఫాను ముప్పుగా మారి దూసుకువస్తుండటంతో.. అటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సహా.. కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. బిపోర్‌జాయ్ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం కీలక సమీక్ష నిర్వహించారు. సోమవారం ఈ మధ్యాహ్నం ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి.. పలు కీలక సూచనలు చేశారు. బిపోర్ జాయ్ తాజా పరిస్థితి, ముందస్తు సహాయక చర్యల ఏర్పాట్లు, తీసుకోవలసిన చర్యలు, తుఫాన్ ముప్పు ఏయే ప్రాంతాలపై ఉంటుంది.. అనే వివరాలను ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులూ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. సహాయక చర్యల ప్రణాళికను ఇప్పటినుంచే ప్రారంభించాలని ప్రధాని మోడీ సూచించారు. లోతట్టు ప్రాంతలు, ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.
బిపోర్‌జాయ్ తుఫాన్ ప్రభావంతో గుజరాత్, ముంబై తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీని కారణంగా ఇప్పటికే అధికారులు పలు సూచనలు చేశారు. జూన్ 15 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దంటూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ఏర్పాటు చేసిన షెల్టర్లలోకి తరలిస్తున్నట్లు గుజరాత్ అధికారులు వెల్లడించారు.
బిపోర్‌జాయ్ తుఫాన్ మధ్య అరేబియా సముద్రంలో పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతికి 480 కిలోమీటర్ల దూరంలో, ద్వారకకు దక్షిణ-నైరుతిగా 530 కిలోమీటర్ల దూరంలో, కచ్‌లోని నలియాకు దక్షిణ-నైరుతికి 610 కిలోమీటర్ల దూరంలో, పాకిస్థాన్‌లోని కరాచీకి దక్షిణాన 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం