AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Elections 2022: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ విశ్లేషకుల్లో పెరుగుతున్న క్యూరియాసిటీ

ప్రస్తుతం జరగబోతున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైన కూడా ఇలాంటి ఆసక్తే ఉంది. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి సహజంగానే వీటిపై అందరి దృష్టి ఉంది.

Assembly Elections 2022: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ విశ్లేషకుల్లో పెరుగుతున్న క్యూరియాసిటీ
Assembly Elections
Balaraju Goud
|

Updated on: Jan 13, 2022 | 4:14 PM

Share

Assembly Elections 2022: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ విశ్లేషకులలో క్యూరియాసిటీ పెరుగుతుండటం సహజం. ప్రస్తుతం జరగబోతున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైన కూడా ఇలాంటి ఆసక్తే ఉంది. వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కాబట్టి సహజంగానే వీటిపై అందరి దృష్టి ఉంది. ఉత్తరప్రదేశ్‌పై ఇప్పటికీ ఓ స్పష్టత రాలేదు. అలాగని మిగతా రాష్ట్రాలలో ఫలానా పార్టీ కచ్చితంగా గెలుస్తుందని చెప్పడానికి కూడా లేదు. ఉత్తరాఖండ్‌ కూడా అలాగే ఉంది. ఇప్పటి వరకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్య గట్టి పోటీ ఉంటుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒకటి కొత్తగా చేరింది. దాంతో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ముక్కోణపు పోటీ ఏర్పడింది. 2000, నవంబర్‌ 9న ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయిన ఈ రాష్ట్రంలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దేవభూమిగా పేరొందిన ఈ స్టేట్‌లో అనేక పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాల సౌందర్యాన్ని చూడాలంటే ఉత్తరాఖండ్‌కే వెళ్లాలి. ఇక్కడ ప్రకృతి కూడా రమణీయంగా మనోహరంగా ఉంటుంది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఓసారి బీజేపీ అధికారంలో ఉంటే, మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేది. ప్రతీ అయిదేళ్లకు ఒకసారి అక్కడ అధికారం మారాల్సిందే. ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం కొద్దో గొప్పో వ్యతిరేకత కూడా ఉంది. ప్రస్తుతం బీజేపీని కలవరపరుస్తున్న అంశం ఇదే! పైగా ఇప్పటికే అక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది బీజేపీ అధినాయకత్వం. ఇది కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. సుస్థిర పాలనను అందించడంలో బీజేపీ విఫలం చెందిందనే మాట విపక్షాల నుంచి వినిపిస్తోంది. గత ఏడాది మార్చి 10న త్రివేంద్ర సింగ్‌ రావత్‌ను సీఎం పదవిలోంచి తొలగించి తీరథ్‌ సింగ్‌ రావత్‌ను గద్దెపై కూర్చోబెట్టింది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఆయననైనా పట్టుమని పది నెలలు ఉంచిందా? నాలుగు నెలలు తిరగక ముందే ఆయనను కూడా మార్చేసింది. జులై 4న రావత్‌ను తొలగించి పుష్కర్‌సింగ్‌ థామీని ముఖ్యమంత్రి చేసింది.

2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 57 స్థానాలు లభించాయి. కాంగ్రెస్‌కు కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఇండిపెండెంట్లు రెండు స్థానాల్లో గెలిచారు. అంత మెజారిటీ సాధించిన బీజేపీ సుస్థిరపాలన అందించలేకపోయింది. జనం కూడా ఈ ముచ్చటనే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దీన్నుంచి బయటపడటానికి అష్టకష్టాలు పడుతోంది. అభివృద్ధినే నమ్ముకుంటోంది. కేదార్‌నాథ్‌ ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రమోట్‌ చేసుకుంటోంది. అలాగే కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను కలుపుతూ ఆరు లైన్ల రహదారి నిర్మాణం , రిషికేశ్‌- కర్ణప్రయాగ్‌ మధ్య రైల్వే లైన్ నిర్మాణం. .. ఈ ఘనతలన్నీ బీజేపీ ప్రభుత్వానికే నని చెప్పుకుంటోంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తియితే మాత్రం ఉత్తరాఖండ్‌ పర్యాటన కేంద్రంగా మారుతుందని, తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుందని ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటున్నారు బీజేపీ నేతలు. మొన్నీమధ్య జరిగిన ఓ సభలో ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. పైగా ఇది ఉత్తరాఖండ్‌ దశాబ్దమని కూడా అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ ఉంటేనే అభివృద్ధి శరవేగంతో జరుగుతుందన్నారు. డబుల్ ఇంజిన్‌ అంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉండటం అన్నమాట. ఈ మాటే ఓటర్లకు పదే పదే చెబుతున్నారు.

నిజానికి బీజేపీపై ప్రజలలలో ఉన్న కొద్దిపాటి వ్యతిరేకతను కాంగ్రెస్‌ పార్టీ సొమ్ము చేసుకోవచ్చు. కానీ ఆ పని చేయడంలో కాంగ్రెస్‌ విఫలం చెందుతోంది. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ను గట్టెక్కించే బాధ్యతను మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ తీసుకున్నాడు, కాకపోతే ఇతర నేతల సహకారం ఆయనకు అంతగా లభించడం లేదు. కలిసికట్టుగా బీజేపీపై పోరు సాగిద్దామని ఎంతగా చెబుతున్నా తోటి నేతలు పట్టించుకోవడం లేదు. ఒకానొక సమయంలో రావత్‌కు కూడా విసుగొచ్చేసింది. రాజకీయాల్లోంచి తప్పుకోవడమే ఉత్తమనని అనిపిస్తోందంటూ తనలోని బాధను బహిరంగంగా వ్యక్తపరిచారు కూడా! అధిష్టానం ఎప్పటికప్పుడు క్లాసులు తీసుకుంటున్నా నేతలు మాత్రం మారడం లేదు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడానికి వెనుకా ముందు అవుతోంది. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో విపక్ష నేత ప్రీతమ్‌సింగ్‌ అయితే హరీశ్‌రావత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి వీలులేదని అంటున్నారు. ఈయనకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దేవేంద్ర యాదవ్‌ వంత పాడుతున్నారు. ఏ సోషల్‌ మీడియాలో అయితే బీజేపీ యాక్టివ్‌గా ఉంటుందో అదే మాధ్యమాల ద్వారా హరీశ్‌ రావత్‌ బీజేపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగం పెరిగిపోయిందని, నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయని ప్రజలకు చెబుతున్నారు.

మరోవైపు ఆమ్‌ ఆద్మీ పార్టీ అయితే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది కానీ ఆ పార్టీకి సంస్థాగత నిర్మాణం అంతగా లేదు. పంజాబ్‌లో ఇచ్చిన హామీలనే ఇక్కడా ఇస్తోంది. తాము గెలిస్తే విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇస్తోంది. రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్‌, బీజేపీల పాలను చూశారు కాబట్టి ఈసారి తమకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండంటూ విన్నవించుకుంటోంది. ఉచిత విద్యుత్‌, ఉద్యోగాల కల్పన, అయిదు వేల రూపాయల నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్‌ వంటి హామీలను ఇచ్చింది ఆప్‌. తమ సీఎం అభ్యర్థిగా రిటైర్డ్‌ కల్నల్ అజయ్‌ కోథియాల్‌ను ప్రకటించింది. ఇక ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఉత్తరాఖండ్‌ క్రాంతిదళ్‌ ఉనికి కోసం తపన పడుతోంది. 2007లో మూడు స్థానాలలలో విజయం సాధించిన ఉత్తరాఖండ్‌ క్రాంతిదళ్‌ ఆ తర్వాతి ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. ఈసారి మాత్రం ఆ పరిస్థితి తెచ్చుకోకూడదని అనుకుంటోంది.

Read Also… Goa Elections: నాయకుడి కుమారుడైతే టికెట్ ఇవ్వాలా.. మాజీ సీఎం కుమారుడికి షాకిచ్చిన బీజేపీ!