16వ అంతస్తు నుంచి కింద పడి టెకీ మృతి.. మిస్టరీగా మరణం!
ఇటీవలే విదేశాల్లో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి ఉద్యోగం కోసం స్వదేశానికి వచ్చిన ఓ టెకీ ఊహించని విధంగా మృత్యువాత పడ్డాడు. 16 అంతస్తుల భవనంపై నుంచి కిందపడి అనూహ్యంగా మరణించాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో బుధవారం (జనవరి 6) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

బెంగళూరు, జనవరి 7: నిక్షప్ (26) అనే వ్యక్తి యూరప్‌లో ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసి ఇటీవల ఉద్యోగం నిమిత్తం బెంగళూరుకు రెండు రోజుల క్రితం తిరిగి వచ్చాడు. నగరంలోని హసరఘట్టలోని గౌడియా మఠంలో అతడు నివసిస్తున్నాడు. బుధవారం బెంగళూరులోని శెట్టిహళ్లిలోని ప్రిన్స్ టౌన్ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్న తన తల్లిదండ్రులు కిషోర్, జయశ్రీ ఫ్లాట్‌కు వెళ్లాడు.
ఏం జరిగిందో తెలియదుగానీ కాసేపటికే నిక్షప్ 16వ అంతస్తు నుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిక్షప్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తన కుమారుడు కొన్నేళ్లుగా స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు నిక్షప్ తండ్రి తెలిపారు.
నిక్షప్ మరణం చుట్టూ ఉన్న పరిస్థితులను దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిక్షప్ తండ్రి కొన్ని సంవత్సరాలుగా స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేదంటే ఎవరైనా అక్కడి నుంచి తోసేశారా అనే విషయం దర్యాప్తు అనంతరం తేలుతుందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




