EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు అలర్ట్.. వడ్డీ రేట్లపై కేంద్రం క్లారిటీ.. ఈ సారి ఎందుకు పెంచలేదంటే..?
ఈపీఎఫ్‌వో వరుసగా మూడోసారి వడ్డీ రేటును స్ధిరంగా కొనసాగించింది. ప్రస్తుతం ఉన్న 8.25 శాతంను కొనసాగించాలని నిర్ణయించింది. ఈపీఎఫ్‌వో ఉద్యోగుల డిపాజిట్లను ప్రభుత్వ బాండ్లలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వ బాండ్ల నుంచి ఆదాయం తక్కువగానే ఉంటుంది. దీంతో వడ్డీ రేటును పెంచడం లేదు.

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్‌వో) 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లను ప్రకటించింది. మార్చి 2న జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి పీఎఫ్ చందాదారులకు 8.25 శాతం వడ్డీ అందించేందుకు ఆమోదం తెలిపింది. గత రెండేళ్లుగా ఇదే వడ్డీని అందిస్తుండగా.. ఇప్పుడు దానిని స్థిరంగా ఉంచింది. దీంతో వరుసగా మూడోసారి కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఈసారి వడ్డీ రేట్లను పెంచడం లేదా కోత విధించడమో జరుగుతుందని చాలామంది ఊహించారు. కానీ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత దేశ ఆర్ధిక పరిస్థితుల క్రమంలో స్థిరంగా ఉంచాలని నిర్ణయించింది. అయితే కేంద్రం వడ్డీ రేట్లను ఎందుకు పెంచలేదనే దానిపై అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి.
పరిమితంగా ఆదాయం
ఈపీఎఫ్‌వో వడ్డీ రేట్లను పెంచడం కంటే స్థిరంగా ఉంచడానికి అనేక కారణాలు ఉన్నాయి. ద్రవ్యల్బణం, ఖర్చులు పెరుగుతుండటంతో ఈపీఎఫ్ వడ్డీ రేటు పెరుగుతుందోమోనని చాలామంది ఆశించారు. కానీ చివరికి కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే పీఎఫ్ అకౌంట్ అనేది సాధారణ సేవింగ్స్ అకౌంట్ లేదా మార్కెట్ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లా పనిచేయదు. ఈపీఎఫ్‌వోకు వచ్చే ఆదాయంపై వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, రుణ సాధారణపై ఆదాయం ముడిపడి ఉంటుంది. ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం పరిమితంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల లేనప్పుడు వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయరు.
ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి
ఈపీఎఫ్‌వో ప్రధానంగా ఎప్పటినుంచో ప్రభుత్వ బాండ్లు, ఇతర రుణ సాధానాల్లో పెట్టుబడి పెడుతోంది. ఈ పెట్టుబడులు పూర్తిగా సురక్షితమైనవని. కానీ వాటి నుంచి వచ్చే ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో రాబడి తక్కుగా ఉన్నప్పుడు అధిక వడ్డీ ఇచ్చేందుకు ముందుకు రాదు. ఒకవేళ అధిక వడ్డీ ఇస్తే భవిష్యత్తులు ఆర్ధికంగా ఇబ్బందులు రావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక అనిశ్చితి కొనసాగుతున్నా ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తున్నట్లు ఈపీఎఫ్‌వో చెబుతోంది. వడ్డీ రేటును స్ధిరంగా ఉంచడం వల్ల వడ్డీ సస్పెన్స్ అకౌంట్‌పై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఈ నిర్ణయం ప్రస్తుత పెట్టుబడి సాధానాల పరిమితులకు దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్‌లు సురక్షిత పెట్టుబడులు, ఆదాయం వైపు మొగ్గు చూపుతాయి. భారత్ కూడా అదే దారిలో నడుస్తందని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. కాగా మార్చి 31లోపు వడ్డీ ఖాతాదారుల అకౌంట్లో జమ కానుందని తెలుస్తోంది.
