ఒంట్లో రోగాలు దాచి పెళ్లి చేశారనీ.. భార్యను దారుణంగా హత్య చేసిన డాక్టర్ మొగుడు!
Bengaluru doctor murder case: పెళ్లికి ముందు భార్యకు అనారోగ్య సమస్యలున్న విషయాన్ని దాచి పెళ్లి చేశారన్న ఆగ్రహంతో ఓ వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. ఆపరేషన్ థియేటర్‌లో పేషెంట్లకు ఇచ్చే అనెస్థీషియా ఇంజక్షన్లు పలు దఫాలుగా ఇచ్చి భార్యను హత్య చేశాడు. తొలుత సహజ మరణంగా భావించినప్పటికీ.. మృతురాలి స్నేహితుడి అనుమానం డాక్టర్ మొగుడి బండారాన్ని బయటపెట్టింది. మృతురాలు కూడా ఓ డాక్టరే కావడం మరో విశేషం. ఈ దారుణ ఘటన బెంగళూరులో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

బెంగళూరు, అక్టోబర్ 16: బెంగళూరులోని మారతహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టోరియా ఆసుపత్రిలో డెర్మటాలజిస్ట్‌గా పనిచేసే డాక్టర్ కృతికా రెడ్డి (28), జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్రరెడ్డిలకు 2024 మే 26న వివాహం జరిగింది. అయితే వీరి వివాహం జరిగిన ఏడాదిలోపే ఆమెకు అజీర్ణం, లోషుగర్, గ్యాస్ట్రిక్ తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నటంలె మహేంద్రకు తెలిసింది. దీంతో రోగాలు దాచి ఈ వివాహం చేశారని రగిలిపోయిన మహేంద్రరెడ్డి.. భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లి నిలదీశాడు. చికిత్స పేరుతో మహేంద్రరెడ్డి భార్యకు అనస్తీషియా డోసులు ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 23న కృతిక హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో హుటాహుటీన అస్పత్రికి తరలించగా అప్పటికే కృతికా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే మొదట్లో ఆమె మరణం సహజంగానే జరిగినట్లు కనిపించినా.. రేడియాలజిస్ట్ అయిన కృతిక అక్క డాక్టర్ నికితా ఎం రెడ్డి అనుమానంతో వివరణాత్మక దర్యాప్తు చేయాలని పట్టుబట్టడంతో అసలు బండారం బయటపడింది.
మరణం తర్వాత దాదాపు ఆరు నెలలకు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నివేదిక వచ్చింది. అందులో మృతురాలి అవయవాలలో ప్రొపోఫోల్ ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారించింది. కృతిక మత్తుమందు కారణంగా మరణించినట్లు నిర్ధారించింది. దీంతో మారతహళ్లి ఠాణా పోలీసులు బుధవారం మహేంద్రరెడ్డిని ఉడిపిలోని మణిపాల్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనస్తీషియా ఓవర్ డోస్ ఇచ్చి హత్య చేసినట్లు విచారణలో మహేంద్ర నేరాన్ని అంగీకరించాడు. భార్యను హత్య చేయడానికి మహేంద్ర తన వృత్తిపరమైన OT, ICU మందులను ఉపయోగించుకున్నాడని, తరువాత దానిని సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.
మహేంద్ర కుటుంబానికి సైతం నేర నేపథ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కవల సోదరుడు డాక్టర్ నాగేంద్ర రెడ్డి జిఎస్ 2018లో హెచ్‌ఎఎల్ పోలీస్ స్టేషన్‌లో పలు చీటింగ్, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓ కుటుంబాన్ని బెదిరించారనే ఆరోపణలతో 2023లో జరిగిన కేసులో మహేంద్ర, మరొక సోదరుడు రాఘవ రెడ్డి సహ నిందితులుగా పేర్కొన్నారు. ఈ వివరాలను వివాహం సమయంలో దాచిపెట్టినట్లు కృతిక కుటుంబం పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




