Pepper Spray: క్లాస్ రూంలో పెప్పర్ స్ప్రే కొట్టిన విద్యార్థి.. స్పృహ తప్పిన టీచర్లు, విద్యార్ధులు!
Pepper spray incident at Kerala govt school: ఓ ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి క్లాస్‌రూమ్‌లోకి పెప్పర్ స్ప్రే తీసుకొచ్చాడు. దాన్ని క్లాస్ రూంలోని టీచర్లు, విద్యార్ధులపై కొట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో 9 మంది విద్యార్థులతో సహా ఇద్దరు టీచర్లు ఆస్పత్రిపాలయ్యారు..

తిరువనంతపురం, అక్టోబర్ 16: కేరళలోని తిరువనంతపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి క్లాస్‌రూమ్‌లోకి పెప్పర్ స్ప్రే తీసుకొచ్చాడు. దాన్ని క్లాస్ రూంలోని టీచర్లు, విద్యార్ధులపై కొట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో 9 మంది విద్యార్థులతో సహా ఇద్దరు టీచర్లు ఆస్పత్రిపాలయ్యారు. కొందరు స్పృహ కోల్పోయారు. వీరంతా శ్వాసకోస ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరారు. వీరంతా తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారందరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పున్నమూడులోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది.
తీవ్రమైన శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ ఇంటర్వెల్ తర్వాత క్లాస్‌రూమ్‌లో ఈ ఘటన జరిగినట్లు పున్నమూడు ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ రాణి చెప్పారు. ఓ టీచర్ క్లాస్‌రూమ్‌కు వెళ్లగా అక్కడ విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు గమనించి వెంటనే క్లాస్‌రూమ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. మరో ఇద్దరు టీచర్లకు కూడా శ్వాస సమస్య వచ్చింది. తరగతి గదిలో పెప్పర్ స్ప్రే కొట్టడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు. అయితే క్లాస్‌రూమ్‌కు పెప్పర్ స్ప్రేను ఎవరు తీసుకువచ్చారో ఇంకా తెలియరాలేదు. ఈ కోణంలో స్కూల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు ఈ సంఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఆమె వైద్య కళాశాల సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి గాయపడిన విద్యార్థులు, టీచర్లకు తగిన చికిత్స అందించాలని కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




