Gujarat: సీఎం భూపేంద్ర మినహా గుజరాత్ మంత్రులు అంతా రాజీనామా
గుజరాత్‌లో పెద్ద రాజకీయ కలకలం రేపిన పరిణామం ఇది. సీఎం భూపేంద్ర పటేల్ తప్ప మిగతా మంత్రులందరూ రాజీనామా చేశారు. శుక్రవారం కొత్త మంత్రివర్గ విస్తరణ జరగనుండగా, సగం మందికి ఉద్వాసన తప్పవని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వివరాలు తెలుసుకుందాం పదండి..

గుజరాత్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప మిగతా అన్ని మంత్రులు తమ రాజీనామాలు సమర్పించారు. ఈ రాజీనామాలను సీఎం భూపేంద్ర పటేల్ ఆమోదించగా, కాసేపట్లో సీఎం గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలవనున్నారు. కొత్త మంత్రివర్గం త్వరలో కొలువుతీరనుంది. పరిపాలనలో నూతన ఉత్సాహం నింపాలన్న లక్ష్యంతో ఈ మార్పులు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు గుజరాత్ కొత్త కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం గుజరాత్ కేబినెట్‌లో మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది క్యాబినెట్ ర్యాంక్, మరొక ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులు(వీరు ఒక కేబినెట్ మంత్రికి సహాయంగా పని చేస్తారు లేదా చిన్న శాఖలను స్వతంత్రంగా చూసుకుంటారు). కొత్త కేబినెట్‌లో సుమారు పది మంది కొత్త మంత్రులు చేరే అవకాశం ఉందని, అలాగే ప్రస్తుత మంత్రుల్లో సగం మందిని మార్పు చేసే అవకాశముందని బీజేపీ వర్గాలు నుంచి అందుతున్న సమాచారం.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 15 శాతం మంది సభ్యులు అంటే 27 మంది మంత్రులు ఉండవచ్చు. అందువల్ల కొత్త కేబినెట్ ఏర్పాటులో మరికొందరికి చోటు దక్కే అవకాశం ఉంది.
ఇటీవలే రాష్ట్ర మంత్రి జగదీశ్ విశ్వకర్మను బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. ఆయన సీఆర్ పాటిల్‌కు వారసుడిగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం కేబినెట్ విస్తరణతో గుజరాత్ పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని, పార్టీ అంతర్గతంగా పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.




