4 నెలల క్రితం కుక్క కాటు.. రేబీస్ వ్యాధితో చిన్నారి మృతి!
నాలుగు నెలల క్రితం నాలుగేళ్ల చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా వీధికుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ముఖం, శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి బెంగళూరులోని..

బెంగళూరు, ఆగస్టు 19: దేశ వ్యాప్తంగా పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ఉదంతాలు చోటు చేసుకున్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం పటిష్ట చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయి. తాజాగా కర్ణాటకలో మరో విషాదం చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం ఓ చిన్నారిని వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. తాజాగా ఆ చిన్నారికి రేబీస్ వ్యాధి సోకడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖదీరాబాను అనే నాలుగేళ్ల చిన్నారి ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా వీధికుక్క దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ముఖం, శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలోనే చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కుక్క కాటుతో రేబీస్ సోకి చిన్నారి చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.
అధికారిక సమాచారం మేరకు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ మధ్య కాలంలో దాదాపు 2.86 లక్షల మంది కుక్క కాటుకు గురయ్యారు. వీరిలో రేబిస్ వ్యాధితో ఏకంగా 26 మంది మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా ఆగస్టు 4 నుంచి 10 మధ్య కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 5,652 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. రేబిస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆరోగ్య అధికారులు కేసులను ట్రాక్ చేయడం, సకాలంలో చికిత్స, టీకాలు వేయడం, పెంపుడు జంతువులపై అవగాహన డ్రైవ్‌లను నిర్వహించడం కొనసాగిస్తున్నారు.

4 Year Old Girl Dies Of Rabies
కాగా ఢిల్లీ వీధుల్లో కుక్కలు కనిపించరాదని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. వీధి కుక్కలన్నింటినీ సాధ్యమైనంత వేగంగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ-ఎన్‌సీఆర్ అధికారులను ఆదేశించింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలంటూ అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించడానికి ధర్మాసనం తిరస్కరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








