గతంలో 14 ఏళ్లు జైలు శిక్ష.. రూ.200 కోసం తోటి కూలీని చంపి మళ్లీ జైలుకెళ్లాడు!
గతంలో మేన మామను చంపి కారాగార శిక్ష అనుభవించినా అతగాడిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. యావజ్జీవ శిక్ష అనుభవించినా అతడి ఆవేశం చల్లారలేదు. కేవలం రూ.200 కోసం తోటి కూలీని అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని కార్వర్‌లో గురువారం రాత్రి (ఆగస్ట్ 14) చోటుచేసుకోగా.. శుక్రవారం ఉదయం వెలుగులోకి..

కార్వర్, ఆగస్ట్ 16: జైల్లో పద్నాలుగేళ్లు కారాగార శిక్ష అనుభవించినా అతగాడిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. యావజ్జీవ శిక్ష అనుభవించినా అతడి ఆవేశం చల్లారలేదు. కేవలం రూ.200 కోసం తోటి కూలీని అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని కార్వర్‌లో గురువారం రాత్రి (ఆగస్ట్ 14) చోటుచేసుకోగా.. శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర కర్ణాటకలోని కమటగేరికి చెందిన మంజునాథ్ బజయ్య చెన్నయ్య 2002లో తన మేనమామను హత్య చేశాడు. ఈ కేసులో అతడు జైలు కెళ్లగా అక్కడ 14 ఏళ్లు యావజ్జీవ శిక్ష అనుభవించాడు. తిరిగి 2016లో జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పట్నుంచి దినసరి కూలీగా పనిచేసకుంటూ బతుకుతున్నాడు. అదే గ్రామానికి చెందిన రవీశ్ గణపతి చెన్నయ్య (35)తో మంజునాథ్‌కు స్నేహం కుదిరింది. వీరు ఇద్దరూ గత కొంత కాలంగా కలిసి కూలీ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇద్దరూ మద్యం సేవించారు. అనంతరం మంజునాథ్ ఇంటి వద్దకు వచ్చారు. అక్కడ కూలీ డబ్బుల విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు.
మంజునాథ్‌కు రూ.500 కూలీ డబ్బులు రావాల్సి ఉండగా.. రవీశ్ గణపతి రూ.300 మాత్రమే చెల్లించాడు. మిగిలిన రూ.200 ఇవ్వకపోవడంతో రవీశ్‌తో మంజునాథ్ గొడవకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన మంజునాథ్ కొడవలితో రవీశ్ తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమైన రవీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. రవీశ్ భార్య ఫిర్యాదు మేరకు సిరి రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మంజునాథ్‌ను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




