72 గంటల మ్యాజిక్.. ఫోన్ పక్కన పెడితే మీ మెదడులో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..?
స్మార్ట్‌ఫోన్ అతిగా వాడుతున్నారా..? అయితే మీ మెదడు ప్రమాదంలో ఉన్నట్లే.. అవును ఫోన్ వ్యసనం మెదడు పనితీరును, ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. నిద్రలేమికి దారితీస్తోంది. అయితే కేవలం 72 గంటలపాటు ఫోన్ వాడకం తగ్గించడం ద్వారా మెదడు తిరిగి ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ మనిషి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది ఫోన్లకు బానిసలయ్యారు. ముఖ్యంగా 30 సెకన్ల రీల్స్ సంస్కృతి మన కళ్ళనే కాదు, మెదడు పనితీరును కూడా దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ చాలామందికి తెలిసినప్పటికీ ఫోన్ వినియోగం మాత్రం తగ్గించలేని పరిస్థితి. అయితే కేవలం 72 గంటలు ఫోన్ వాడకం తగ్గిస్తే మెదడు తిరిగి ఉత్తేజితం అవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
రాత్రి వేళల్లో ఫోన్ చూడటం వల్ల దాని నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రకు కారణమయ్యే హార్మోన్ల విడుదలను అడ్డుకుంటుంది. ఇది గాఢ నిద్రను దూరం చేసి, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిరంతరం ఫోన్ స్క్రీన్‌ను చూడటం వల్ల మెదడు అలసటకు గురై జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మానసిక ఆందోళన, గందరగోళం పెరుగుతాయి. అందుకోసమే ప్రతి అరగంటకు ఒకసారైనా కనీసం ఒక బ్రేక్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు బ్రేక్ తీసుకోవడం పెద్దగా ఇష్టపడరు.
కేవలం ముఖ్యమైన పనులకు మాత్రమే ఫోన్ వాడితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫోన్ తక్కువ వినియోగించడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని కంప్యూటర్స్ కంప్యూటర్స్ ఇన్ హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఫోన్ వాడకం తగ్గించడం వల్ల మెదడులోని రివార్డ్ ప్రాసెసింగ్, ఇంపల్స్ కంట్రోల్ ప్రాంతాల్లో సానుకూల మార్పులు వస్తాయి. ఇది మనిషి యొక్క చెడు అలవాట్లను, వ్యసనాలను అదుపులో ఉంచుతుంది. యువతలో మెదడు స్పందించే తీరు మెరుగుపడుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.
ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫోన్ వాడకాన్ని పూర్తిగా మానేయలేకపోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఫోన్ వాడుతున్నప్పుడు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కనీసం 5 నిమిషాల పాటు కళ్ళకు, మెదడుకు విశ్రాంతి ఇవ్వాలి. నెలకు కనీసం మూడు రోజుల పాటు స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని కనిష్ట స్థాయికి తగ్గించాలి. ఇది బ్రెయిన్ రీసెట్‌లా పనిచేసి ఆందోళనను, అలసటను దూరం చేస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




