Lifestyle: ఇష్టంగా రోజూ ఇడ్లీ లాగించేస్తున్నారా.? ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది
ప్రతీ ఒక్కరికి ఇడ్లీ చాలా ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్. కొందరికి అయితే ఉదయాన్నే ఇడ్లీ టిఫిన్ గా పడకపోతే రోజు కూడా గడవదు. మరి ఇష్టమని రోజూ ఇడ్లీ లాగించేస్తున్నారా.? అలా చేస్తే ఏం జరుగుతుందో..? వైద్య నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు చూద్దాం.

సౌత్, నార్త్ అని తేడా లేదు. చాలామంది ఇడ్లీ అనేది ఇష్టమైన అల్పహరాల్లో ఒకటి. తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీని చాలామంది ఉదయాన్నే లాగించేస్తూ.. తమ రోజును మొదలుపెడతారు. కానీ, రోజూ ఇడ్లీ తినడం వల్ల ఏమవుతుంది? ఆరోగ్యానికి మంచిదా లేక ఏమైనా సమస్యలు వస్తాయా? ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇడ్లీ కడుపుకు భారం కాకుండా తేలికగా జీర్ణమవుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడానికి ఇడ్లీ బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్. ఇడ్లీలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ బీ ఉన్నాయి. అలాగే ఇడ్లీ పిండిని పులియబెట్టడం వల్ల ప్రోబయోటిక్స్(మంచి బ్యాక్టీరియా) కూడా ఏర్పడతాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తాయి. ఇడ్లీ తయారీలో నూనెను ఉపయోగించరు కాబట్టి.. ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి సాంబార్ లేదా కూరగాయలతో కలిపి ఇడ్లీని తింటే మంచిది. ఇడ్లీలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఉదయం తినడం వల్ల రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండొచ్చు.
రోజూ ఇడ్లీ తింటే సమస్యలు ఏమైనా ఉన్నాయా?
రోజూ ఇడ్లీ మాత్రమే బ్రేక్ ఫాస్ట్‌గా తింటే శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలు, ఫైబర్, విటమిన్ సి, లేదా ఖనిజాలు తక్కువగా అందుతాయి. అందుకే అల్పాహారం రోజుకొకటి తినడం మంచిది. అలాగే ఇడ్లీ బియ్యంతో తయారవుతుంది కాబట్టి దీని గ్లైసెమిక్ ఇండెక్స్(GI) కొంత ఎక్కువగా ఉంటుంది. రోజూ ఎక్కువ మొత్తంలో తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. డయాబెటిస్ ఉన్నవారు ఇడ్లీని మితంగా తినాలి. అటు రోజూ ఇడ్లీ తినడం వల్ల కొంతమందికి ఫుడ్‌పై బోర్ కొట్టే ఛాన్స్ ఉంది.