మీ ఇంట్లో చెదల సమస్య ఉందా..? ఓసారి ఇలా చేసి చూడండి..!
ఇంట్లో చెదలు పడితే వాటిని పట్టించుకోకపోతే చెక్క ఫర్నిచర్, గోడలు త్వరగా పాడైపోతాయి. మొదట్లోనే వాటిని అరికడితే పెద్ద నష్టాన్ని తప్పించుకోవచ్చు. మన ఇంట్లో దొరికే వాటి తోనే చెదల ను ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

చెక్క ఫర్నిచర్ ను పాడు చేసే చెదలు ఇంట్లో ఉన్నాయా..? అవి గోడలపై గీతలు వేస్తూ ఇంటి అందాన్ని కూడా పాడు చేస్తున్నాయా..? అయితే వాటిని మొదట్లోనే అదుపు చేయకపోతే చాలా వేగంగా ఇల్లు మొత్తాన్ని పాడు చేస్తాయి. కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
చెదలతో ఇబ్బందులు
చెదలు చాలా ఇళ్లలో కామన్ ప్రాబ్లమ్. ఇవి చెక్కలో పెరిగి, అల్మారాలు, తలుపులు, కిటికీలను పాడుచేస్తాయి. ఒక్కసారి మొదలయితే త్వరగా ఇల్లంతా పాకేస్తాయి. కేవలం చెక్కనే కాకుండా.. గోడలపై పొడవాటి గీతలు వేసి చూడడానికి చిరాకుగా అనిపిస్తాయి. ఇంటి చిట్కాలతో వీటికి చెక్ పెట్టొచ్చు. ఇక నుండి చెదలు కనిపించినప్పుడు.. మొదట్లోనే ఈ చిట్కాలను వాడి వాటిని నియంత్రించండి.
ఇంటి చిట్కాలతో చెదలకు చెక్
- ఉప్పు నీటితో స్ప్రే.. ఒక స్ప్రే బాటిల్ లో నీటిని తీసుకుని అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ నీటిని చెదలు ఉన్న గోడలపై లేదా చెక్కపై రోజూ స్ప్రే చేయాలి. ఉప్పు వాటి పెరుగుదలను ఆపుతుంది.
- వేప నూనెతో స్ప్రే.. ఒక బాటిల్ లో నీటిని తీసుకుని రెండు స్పూన్ల వేప నూనె కలిపి స్ప్రే చేయాలి. వేప వాసనకు చెదలు అక్కడి నుంచి వెళ్లిపోతాయి. రోజు వారీగా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
- వెనిగర్ సొల్యూషన్.. సగం బాటిల్ నీటిలో 2 నుంచి 3 టీ స్పూన్ల వెనిగర్ వేసి బాగా కలిపి స్ప్రే చేయాలి. దీని వల్ల చెదలు చనిపోతాయి.
ప్రొఫెషనల్ సహాయం అవసరమా..?
ఈ చిట్కాలు చిన్న మొత్తంలో ఉన్న పురుగులకు మాత్రమే పనిచేస్తాయి. ఒకవేళ చెదలు ఎక్కువగా వ్యాపిస్తే మార్కెట్‌లో దొరికే పెస్ట్ కంట్రోల్ మందులు వాడటం లేదా నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే చెదలను పూర్తిగా తొలగించడం కష్టం. అవి మళ్లీ రాకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు తనిఖీలు చేసుకుంటూ ఉండాలి.




