Loneliness Tips: ఒంటరితనం వేధిస్తోందా? ఇలా చేసి చూడండి!
ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ మన చుట్టూ ఎవరూ లేకపోతే.. ఒంటరిగా ఉన్నామన్న ఫీలింగ్ కలగడం సహజం. మళ్లీ చుట్టూ నలుగురు చేరగానే ఆ ఫీలింగ్ పోయి, మామూలుగా మారిపోతాం. కానీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగానే ఉన్నామనిపిస్తుంది కొంతమందికి. ‘నాకంటూ ఎవరూ లేరు ఈ ప్రపంచంలో’ అనే బాధ వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి ఒంటరితనం నుంచి ఎలా బయటపడాలంటే..

ఒంటరితనం అనేది ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇలాంటివాళ్లు ఎవ్వరితోనూ సరిగా మాట్లాడలేరు. నలుగురిలోకి వెళ్లినప్పుడు ఒంటరితనం ఆవహిస్తుంది. ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలనిపిస్తోంది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఎప్పుడూ వాళ్ల ఒంటరి ప్రపంచంలోనే గడుపుతుంటారు. యాంగ్జైటీ, డిప్రెషన్ లాగానే లోన్లీనెస్ డిజార్డర్ కూడా ఒకరకమైన మెంటల్ ఇల్‌నెస్. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతూ, తమపై తమకు ద్వేషం పెంచుకుంటారు. కారణం లేకపోయినా అనవసరంగా ఎప్పుడూ బాధ పడుతూ ఉంటారు. ఈ బాధతో కొంతమందికి విపరీతమైన ఆలోచనలు కూడా వస్తాయి. ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి మానసికంగా కొంత అవగాహన అవసరం.
కారణాలు ఇవే..
ఈ మధ్య కాలంలో ఇలాంటి సమస్యలు ఎక్కువవడానికి టెక్నాలజీ కూడా ఒక కారణం. నిజానికి టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే ఒంటరి తనం అనే బాధ నుంచి బయట పడొచ్చు. టెక్నాలజీ ఒక్కటే స్నేహితులందరినీ ఒకేచోట చేర్చే ఆయుధం. కానీ అదే టెక్నాలజీని సరిగ్గా వాడుకోవడం తెలియకపోతే.. ఒంటరితనానికి అదే ముఖ్య కారణంగా మారుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాల్లో ఎక్కువగా గడపడం, మొబైల్ లేకుండా ఉండలేకపోవడం లాంటి వాటి వల్ల రియల్ వరల్డ్‌కు దూరమై రానురాను ఒంటరితనం పెరుగుతూ పోతుంది.
ఒంటరితనానికి నలుగురిలో ఇమడలేకపోవడం కూడా కారణం. చిన్నప్పటి నుంచి ఒకే రకమైన వాతావరణంలో పెరగడం, పెద్దగా అందరితో కలవకపోవడం వల్ల కూడా ఒంటరితనం పెరిగే అవకాశముంది. కొన్ని సార్లు ఎంచుకున్న దారిలో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు పాజిటివ్‌గా ఉండకపోతే.. మనపై మనమే విశ్వాసం కోల్పోయే ప్రమాదముంది. ఇతరులతో పోల్చుకుంటూ తక్కువ అంచనా వేసుకోవటం వల్ల ఒంటరిని అన్న భావన పెరిగే అవకాశం ఉంది.
ఇలా బయటపడొచ్చు
- ఒంటరితనం ఒక ఉచ్చు లాంటిది. దీన్నుంచి బయటపడటానికి చాలా ప్రాక్టిస్, ఎంతో ధైర్యం కావాలి. ఒంటరితనాన్ని ఎవరికి వాళ్లు బ్రేక్ చేయాలే తప్ప మరో దారి లేదు. అసలు ఒంటరితనం ఎందుకు ఆవహించింది? ఎప్పటినుంచి ఇలా అనిపిస్తుంది? అనేవి పరిశీలించుకోవాలి.
- కొత్త మనుషులతో పరిచయాలు పెంచుకోవాలి. దగ్గరగా ఉన్న ఆత్మీయులు, స్నేహితులతో మనస్ఫూర్తిగా గడపాలి. ఒంటరిగా ఫీలయ్యే వాళ్లు ఎవరితో అంతగా మాట్లాడ్డానికి ఇష్టపడరు. అందుకే ముందు మాట్లాడ్డంతో మొదలు పెట్టాలి. ఎప్పుడు, ఎక్కడున్నా.. మనసులో అనిపిస్తున్న భావాన్ని ఎవరో ఒకరితో చెప్పుకోవాలి. మొహమాటాన్ని వదిలేసి కలుపుగోలుగా ఉండడానికి ట్రై చేయాలి.
- లోన్లీగా ఫీలయ్యే వాళ్లు ఎప్పుడూ డల్‌గా కూర్చోకుండా యాక్టివ్‌గా ఉండాలి. వ్యాయామం అలవాటు చేసుకోవాలి. తాజా ఆకుకూరలు, కూరగాయలు, సిట్రస్ పండ్ల రసాలు తాగాలి. శరీరం యాక్టివ్‌గా ఉంటే ఆలోచనలూ యాక్టివ్‌గా ఉంటాయి. దాంతో పాజిటివిటీ పెరుగుతుంది.
- మనలాగే ఆలోచించే వ్యక్తులను ఫ్రెండ్స్‌గా చేసుకోవాలి. వాళ్లతో ఆలోచనలు, హ్యాబిట్స్ లాంటివి పంచుకోవాలి. కలిసి చేసే యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి. అలా మనుషులతో కమ్యూనికేషన్ పెంచుకోవడం వల్ల ఈజీగా ఒంటరితనం అనే ఫీలింగ్ నుంచి బయటపడొచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




