హైబీపీకి చెక్ పెట్టే రెడ్ మ్యాజిక్.. రోజూ ఒక్క గ్లాస్ తాగితే 3 గంటల్లోనే అద్భుతం..
Beetroot Juice: నేటి జీవనశైలి వల్ల హై బీపీ సమస్య పెరుగుతోంది. ఈ సమస్యకు బీట్‌రూట్ రసం ఒక సహజసిద్ధమైన పరిష్కారం. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను వెడల్పు చేసి, రక్త ప్రవాహాన్ని సులభతరం చేస్తాయి. రోజుకు 200-250 మి.లీ రసం తాగడం ద్వారా బీపీ అదుపులో ఉంటుందని శాస్త్రీయ అధ్యయనాలు తెలుపుతున్నాయి.

నేటి ఉరుకుల పరుగుల జీవితం, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లు సైలెంట్ కిల్లర్‌గా పిలిచే అధిక రక్తపోటును మన దరికి చేరుస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. దాదాపు 1.3 బిలియన్ల మంది ఈ సమస్యతో సతమతమవుతున్నారు. అయితే మన వంటగదిలో దొరికే బీట్‌రూట్ ఈ సమస్యకు సహజసిద్ధమైన పరిష్కారమని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
రక్తపోటును ఎలా తగ్గిస్తుంది?
బీట్‌రూట్ రసంలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్ గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను వెడల్పు చేసి, అవి సరళంగా మారేలా చేస్తుంది. దీనివల్ల రక్త ప్రవాహం సులభతరం అవుతుంది. ఫలితంగా రక్తనాళాలపై ఒత్తిడి తగ్గి బీపీ అదుపులోకి వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రసం తాగిన 3 నుండి 4 గంటల్లోనే రక్తపోటు తగ్గడం ప్రారంభమవుతుంది.
శాస్త్రీయ ఆధారాలు – ఎంత తాగాలి?
2017లో జరిగిన ఒక విశ్లేషణ ప్రకారం.. బీట్‌రూట్ రసం క్రమం తప్పకుండా తాగడం వల్ల సిస్టోలిక్, డయాస్టొలిక్ రీడింగులు రెండూ తగ్గుతాయని తేలింది. అధ్యయనాల ప్రకారం.. రోజుకు 200 మి.లీ నుండి 250 మి.లీ బీట్‌రూట్ రసం తాగడం వల్ల ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి. ఈ స్వల్ప తగ్గుదల కూడా స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
అధిక రక్తపోటుకు ఇతర ప్రధాన కారణాలు:
- ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి నిల్వ పెరిగి రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది.
- వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, ప్రాసెస్ చేసిన ఆహారాలు.
- ధూమపానం, మద్యం సేవించడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి.
జాగ్రత్తలూ అవసరమే
బీట్‌రూట్ రసం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ అందరికీ ఒకేలా సరిపడకపోవచ్చు..
కిడ్నీ సమస్యలు: బీట్‌రూట్‌లో ఆక్సలేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి.
జీర్ణ సమస్యలు: ఖాళీ కడుపుతో తాగితే కొంతమందిలో ఉబ్బరం లేదా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.
బీట్రియా: ఈ రసం తాగినప్పుడు మూత్రం లేదా మలం ఎరుపు రంగులోకి మారవచ్చు. ఇది హానికరం కాదు.. రసం ఆపగానే తగ్గిపోతుంది.
బీట్‌రూట్ రసంతో పాటు ఉప్పు తగ్గించడం, పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు వంటివి తీసుకోవడం, రోజుకు 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఏదైనా మార్పులు చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








