పాల నుంచి కారం వరకు.. కల్తీ పదార్థాలను ఇంట్లోనే ఎలా గుర్తించాలో తెలుసుకోండి
మీరు తినే ఆహారం.. తాగే పాలు.. చివరకు ఇంట్లో వాడే కారం పొడి వరకు.. అన్నీ విషతుల్యమేనా? కల్తీ సామ్రాజ్యం విస్తరిస్తు సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఫుడ్ సేఫ్టీ రైడ్స్ చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది? ఏ వస్తువు కల్తీదో ఏది నిజమైనదో మనం ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉరుము లేని పిడుగులా విరుచుకుపడుతున్నారు. బడా రెస్టారెంట్లు మొదలుకొని వీధి పక్కన బండ్ల వరకు దేన్నీ వదలడం లేదు. కిచెన్లలో అడుగుపెడితే కళ్లు బయర్లు కమ్మే నిజాలు బయటపడుతున్నాయి. నెలల తరబడి నిల్వ ఉంచిన మాంసం, రంగులు కలిపిన పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తుంది. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ఆరోగ్యాన్ని తుంగలో తొక్కేస్తున్న కల్తీ రాయుళ్లు. ఈ తనిఖీలతో అలాంటి వారి పనిపడుతోంది ప్రభుత్వం.
కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా.. కల్తీకి పాల్పడి వారిపై క్రిమినల్ కేసులు, జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది. హెల్త్ ప్రొఫైలింగ్ లో భాగంగా ప్రజల ఆరోగ్యంపై ఆహార ప్రభావం ఎలా ఉందో విశ్లేషిస్తోంది. ఇక నుంచి ప్రతి చోట హైజీన్ రేటింగ్ ను ప్రదర్శించడం తప్పనిసరి చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ, కల్తీ రాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ప్రభుత్వం.
మరి ఇంత కల్తీలో సామాన్యుడు తనను తాను ఎలా కాపాడుకోవాలి? కల్తీ ఏదో నిజమైనది ఏదో అనే విషయాన్ని ఎలా గుర్తించాలి అనే విషయానికి వస్తే.. మీ ఇంట్లోనే చిన్న చిన్న పరీక్షలతో కల్తీని ఈజీగా పసిగట్టవచ్చు అంటున్నారు నిపుణులు. పాల నుంచి కారం వరకు నకిలీ వాటిని ఎలా గుర్తించాలో చూద్దాం.
- కల్తీ పాలను గుర్తించడం: ఒక చుక్క పాలను నిలువుగా ఉన్న ప్లేట్ పై వేయండి. అది తెల్లటి గీతను వదిలితే స్వచ్ఛమైనది, నీళ్లలా పారితే కల్తీ జరిగినట్లే అర్థం.
- కల్తీ కారం: గ్లాసు నీటిలో చెంచా కారం వేయండి. రంగు నీటిలోకి త్వరగా దిగినా, ఇసుకలాంటి పదార్థం అడుగున చేరినా అది కల్తీ కారం అని అర్థం.
- కల్తీ పండ్లు: మెరిసిపోతున్న పండ్లను చూసి మోసపోకండి. కాల్షియం కార్బైడ్ వాడితే పండ్లు పసుపు పచ్చగా ఉన్నా, లోపల రుచి ఉండదు. కాబట్టి కల్తీ పండ్లను గుర్తించేందుకు ఒక జగ్గులో నీటిని నింపి అందులో పండ్లను వేయండి. రసాయనాలతో పండించిన పండ్లు లోపల గాలితో నిండి ఉండి, నీటిపై తేలుతాయి.
- ఒక్క పండే కాదు ఒక కారంపొడే కాదు.. ఇంట్లో మనకు రెగ్యులర్గా అవసరమయ్యే పన్నీర్, బెల్లం, పప్పు దినుసులు, ధనియాలు, రాగులు ఇలా చాలా వస్తువులను బేసిగ్గా మనం చూపు ద్వారా లేదా చిన్నపాటి టెస్టు ద్వారా ఏది కల్తీ ఏది ఒరిజినల్ గుర్తుపట్టవచ్చు.
ఆరోగ్యమే మహాభాగ్యం.. కానీ ఆ ఆరోగ్యం మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంది. ప్రభుత్వం తన వంతుగా తనిఖీలు చేస్తున్నా, వినియోగదారులుగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి.ఎక్కడికి వెళ్లిన రంగు,రుచితో పాటు అసలు, నకిలీ నీ కూడా గమనించండి. కల్తీ కనిపిస్తే ఏమాత్రం ఉపేక్షించకుండా అధికారులకు ఫిర్యాదు చేయండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
