మగవారిని మౌనంగా వెంటాడుతున్న వ్యాధి.. జాగ్రత్తపడకుంటే అంతే సంగతులు!
హైదరాబాద్‌లో మగవారిని మౌనంగా వెంటాడుతున్న వ్యాధి.. ప్రోస్టేట్ క్యాన్సర్..! బయటకు పెద్దగా కనిపించదు. కానీ లోపల నిశ్శబ్దంగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా లేకపోవడంతో చాలామంది దీనిని సాధారణ వృద్ధాప్య సమస్యగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితం.. ఆసుపత్రికి చేరే సమయానికి వ్యాధి ముదురుతోంది.

హైదరాబాద్‌లో మగవారిని మౌనంగా వెంటాడుతున్న వ్యాధి.. ప్రోస్టేట్ క్యాన్సర్..! బయటకు పెద్దగా కనిపించదు. కానీ లోపల నిశ్శబ్దంగా పెరుగుతుంది. ముఖ్యంగా ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా లేకపోవడంతో చాలామంది దీనిని సాధారణ వృద్ధాప్య సమస్యగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితం.. ఆసుపత్రికి చేరే సమయానికి వ్యాధి మూడో, నాలుగో దశలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది ఏకంగా ప్రాణాలనే మింగేస్తుంది.
తాజాగా విడుదలైన నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) రిపోర్ట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో పురుషుల్లో నమోదవుతున్న క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ వాటా దాదాపు 6.9 శాతం. మరోవైపు 2026 నాటికి తెలంగాణలో పురుషుల్లో 21 వేలకుపైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే… స్క్రీనింగ్ చేయించుకునే వారి శాతం 4 శాతం కంటే తక్కువే.
అనారోగ్యకర జీవనశైలి ఈ సమస్యను మరింత పెంచుతోందంటున్నారు వైద్య నిపుణులు. ఊబకాయం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, అధిక కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు ప్రమాదాన్ని పెంచుతున్నాయి. ఇవి క్రమంగా శరీరంలో మార్పులకు దారితీస్తూ క్యాన్సర్‌కు మార్గం సుగమం చేస్తున్నాయి. మరో కీలక అంశం… ప్రారంభ లక్షణాల నిర్లక్ష్యం. తరచుగా మూత్ర విసర్జన, ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువసార్లు లేచి వెళ్లడం, మూత్రం బలహీనంగా రావడం, ప్రారంభించడంలో ఇబ్బంది, పూర్తిగా ఖాళీ కాలేదనే భావన.. ఇవన్నీ చాలా మంది వృద్ధాప్యానికి సహజమని భావిస్తున్నారు. కానీ ఇవే ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ప్రారంభ సంకేతాలు కావొచ్చంటున్నారు నిపుణులు.
ఈ నిర్లక్ష్యం కారణంగా చాలామంది రోగులు స్టేజ్-4లోనే గుర్తిస్తున్నట్లు వైద్యులు చెబతున్నారు. ఈ దశలో జీవించే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. జాతీయ స్థాయి లెక్కల ప్రకారం… ఈ దశలో మరణాల రేటు సుమారు 65 శాతం వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో 50 నుంచి 74 ఏళ్ల మధ్య ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్న అంచనాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. 50 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ప్రమాదం పెరుగుతుంది. కుటుంబంలో తండ్రి లేదా సోదరుడికి ఈ వ్యాధి ఉంటే అవకాశం మరింత అధికం. హార్మోన్ల ప్రభావం, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ స్థాయిలు కూడా దీనిపై ప్రభావం చూపుతాయి. ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోయినా.. తరువాతి దశల్లో మూత్రంలో రక్తం, వీర్యంలో రక్తం, బరువు అకస్మాత్తుగా తగ్గడం, అలసట వంటి లక్షణాలు కనిపించవచ్చు.
నిపుణులు చెబుతున్నదీ ఒక్కటే.. ముందస్తు పరీక్షలే ప్రాణాలను కాపాడగలవు. 50 ఏళ్లు దాటిన ప్రతి పురుషుడు నియమితంగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. కుటుంబంలో చరిత్ర ఉంటే మరింత జాగ్రత్త అవసరం. జీవనశైలిలో మార్పులు, సమతుల్య ఆహారం, వ్యాయామం… ఇవి ప్రమాదాన్ని తగ్గించగలవని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం పరిశోధన అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయం ఆధారంగా రూపొందించడం జరిగింది. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా కొత్త కార్యాచరణ చేపట్టే ముందు ఎల్లప్పుడూ మీ వైద్యుడిని లేదా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
