పవన్ కల్యాణ్‌ను సినిమా నటుడిగానే చూస్తాం: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ ఏర్పాటు చేయ తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సభ'కు పోలీసులు అనుమతి నిరాకరించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పవన్‌పై తీవ్ర విమర్శలు చేయగా, జనసేన హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు కూడా పిటిషన్‌ను కొట్టేయడంతో సభ రద్దయ్యింది.

పవన్ కల్యాణ్‌ను సినిమా నటుడిగానే చూస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తెలంగాణ నవ నిర్మాణ సభ ఏర్పాటుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే అందుకు తెలంగాణ పోలీసులు ఆ సభకు అనుమతి నిరాకరించారు. దీంతో ఈ విషయం కూడా రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే మహేష్ గౌడ్ ఈ అంశంపై స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ ను నటుడిగానే చూస్తామని, తెలంగాణలో పవన్‌కు రాజకీయం చేసే హక్కు లేదని అన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టాలనే తెలంగాణలో పవన్ సభ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అలాగే పవన్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై స్పందిస్తూ శాంతిభద్రతల సమస్య వస్తుందనే సభకు అనుమతివ్వలేదని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు కాంగ్రెస్ అండగా ఉంటుందని, అసలు ఆంధ్రా నాయకులకు తెలంగాణలో తిరిగే హక్కులేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉందని ఆయన తెలిపారు.
హైకోర్టుకు జనసేన లీగల్ టీమ్
తెలంగాణ నవ నిర్మాణ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై జనసేన పార్టీ లీగల్ టీమ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. జనసేన సభకు అనుమతి కోరుతూ ఇప్పటికే రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కాగా తమ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సాయంత్రం 4:30కి హైదరాబాద్ లోని జూబ్లీహీల్స్ లో గల తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు తెలిపారు. కనీసం ప్రెస్ మీట్‌కైనా పోలీసులు అనుమతిస్తారా అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. మరోవైపు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎంపీలు తమ ఆస్తులను అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ యువత పవన్ వెంట నడుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పిటిషన్ కొట్టేసిన హైకోర్టు..
జనసేనకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పవన్ సభకు అనుమతి నిరాకరిస్తూ హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరించింది. సభకు అనుమతి ఇవ్వాలని జనసేన లీగల్ టీమ్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ ను స్క్రూటినీ దశలోనే హై కోర్టు రిజిస్ట్రి తిరస్కరించింది. ఇప్పుడు కోర్టు పిటిషన్ తిరస్కరించడంతో సాయంత్రం పవన్ కల్యాణ్ సభ లేదనే విషయం స్పష్టమైంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచే పవన్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
