మహిళలు ఏడాదికి ఒక్కసారైనా ఈ టెస్టులు చేయించుకోవాల్సిందే.. లైట్ తీసుకుంటే జరిగేది ఇదే..
ఇంట్లో అందరి ఆరోగ్యాన్ని బాధ్యతగా చూసుకునే మహిళలు.. తమ సొంత హెల్త్ విషయానికి వచ్చేసరికి మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తుంటారు. చాలాసార్లు థైరాయిడ్, షుగర్, రక్తహీనత వంటి ప్రమాదకరమైన జబ్బులు బాడీలోకి సైలెంట్‌గా ఎంటర్ అవుతాయి. కానీ బయటకు ఎలాంటి లక్షణాలు చూపించవు. అందుకే పెద్ద ప్రమాదం ముంచుకొచ్చే ముందే అలర్ట్ అవ్వాలని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

మహిళల ఆరోగ్యం జీవితంలోని వివిధ దశల్లో ఎన్నో రకాల మార్పులకు లోనవుతుంటుంది. హార్మోన్ల ఒడిదుడుకులు, పీరియడ్స్ సమస్యలు, గర్భధారణ, వృద్ధాప్యం వంటివన్నీ వారి బాడీపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే చాలామంది మహిళలు ఇల్లాలుగనో, ఉద్యోగినిగనో అందరి బాధ్యతలు చూసుకుంటూ తమ సొంత ఆరోగ్యాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటారు. చాలా రకాల ఆరోగ్య సమస్యలు ప్రారంభ దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు చూపించవు. అందుకే సమస్య పెద్దదయ్యే వరకు ఆగకుండా, మహిళలు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా కొన్ని ముఖ్యమైన రక్త పరీక్షలు చేయించుకోవడం ప్రాణావసరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డాక్టర్లు ఏం చెబుతున్నారు?
జైపూర్‌లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ ప్రసూతి, గైనకాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రతిమా పొద్దార్ అభిప్రాయం ప్రకారం.. మహిళలు తమ అంతర్గత ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి ఏటా ఖచ్చితంగా కొన్ని బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి.
బ్లడ్ టెస్ట్ పేరు
CBC (కంప్లీట్ బ్లడ్ కౌంట్) : బాడీలో రక్తం ఎంతుందో చూపిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత , ఇతర ఇన్ఫెక్షన్లను గుర్తిస్తుంది.
బ్లడ్ షుగర్ టెస్ట్ : మధుమేహం వచ్చే ముప్పును ముందే పసిగడుతుంది.
లిపిడ్ ప్రొఫైల్ : రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను చూపిస్తూ గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేస్తుంది.
థైరాయిడ్ ప్రొఫైల్ (TSH, T3, T4) : బరువు పెరగడం, మూడ్ స్వింగ్స్, హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలను గుర్తిస్తుంది.
విటమిన్ డి – విటమిన్ బి12 : ఎముకల బలహీనత, నరాల నీరసం, తీవ్ర అలసటకు గల కారణాలను వెల్లడిస్తుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లేట్ చేయొద్దు
మీ ఇంట్లోని మహిళల్లో ఈ లక్షణాలు గనుక కనిపిస్తే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించడం చాలా ముఖ్యం.
- నిరంతర అలసట, నీరసం, తల తిరగడం.
- ఎలాంటి కారణం లేకుండానే అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గిపోవడం.
- విపరీతంగా జుట్టు రాలడం, తరచుగా అనారోగ్యం పాలవ్వడం.
- నెలసరి క్రమం తప్పడం లేదా అసాధారణ మార్పులు రావడం.
- అధికంగా దాహం వేయడం, తరచుగా మూత్రవిసర్జన అవ్వడం.
- గుండె వేగంగా కొట్టుకోవడం లేదా దీర్ఘకాలంగా బాడీలో ఎనర్జీ లేనట్టు అనిపించడం.
మహిళల మెరుగైన ఆరోగ్యం కోసం ఈ 5 సూత్రాలు మస్ట్..
సమతుల్య ఆహారం: రోజువారీ డైట్‌లో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
రెగ్యులర్ వ్యాయామం: రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయడం వల్ల హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి.<
తగినంత నిద్ర – నీరు: రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర, తగినంత నీరు త్రాగడం బాడీ మెటబాలిజానికి చాలా మంచిది.
ఒత్తిడికి చెక్: మానసిక ఒత్తిడి వల్లనే సగం రోగాలు వస్తాయి కాబట్టి ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి.
నిర్లక్ష్యం వద్దు: ఏ చిన్న ఆరోగ్య సమస్య కనిపించినా సొంత వైద్యం చేసుకోకుండా.. వెంటనే ల్యాబ్‌కు వెళ్లి టెస్టులు చేయించి, క్వాలిఫైడ్ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.
