AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తులసి చెట్టు పచ్చగా, గుబురుగా పెరగాలంటే పెరుగుతో ఇలా చేస్తే చాలు.. ఎవ్వరు చెప్పని సీక్రెట్ టిప్స్

ఇంట్లో తులసి మొక్క ఎప్పుడూ పచ్చగా, కలకలలాడుతూ ఉంటే ఆ ఇల్లే ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ చాలామందికి తులసి మొక్కలు త్వరగా వాడిపోవడం, ఆకులు రాలిపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. అయితే దీనికోసం మార్కెట్లోకి వెళ్లి కెమికల్ ఎరువులు కొనాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో దొరికే కేవలం ఒకే ఒక్క చెంచా పెరుగుతో వాడిపోయిన తులసి మొక్కకు మళ్లీ ప్రాణం పోయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తులసి చెట్టు పచ్చగా, గుబురుగా పెరగాలంటే పెరుగుతో ఇలా చేస్తే చాలు.. ఎవ్వరు చెప్పని సీక్రెట్ టిప్స్
Tulsi Plant Care Tips
Krishna S
|

Updated on: Jun 02, 2026 | 1:27 PM

Share

హిందూ సంప్రదాయంలో ప్రతి ఇంట్లోనూ తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇంటి ఆవరణలో తులసి మొక్క పచ్చగా, దట్టంగా పెరిగితే చూడటానికి అందంగా ఉండటమే కాదు.. ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తుందని నమ్ముతారు. అయితే చాలామంది ఇళ్లలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు తులసి మొక్క అకస్మాత్తుగా వాడిపోవడం, ఆకులు ఎండిపోయి రాలిపోవడం లేదా ఎదుగుదల ఆగిపోవడం వంటివి జరుగుతుంటాయి. దీనికోసం మార్కెట్లో దొరికే ఖరీదైన రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే లభించే ఒకే ఒక్క పవర్‌ఫుల్ వస్తువుతో తులసి మొక్కను మళ్లీ చిగురింపజేయవచ్చు.

తులసి మొక్కకు ప్రాణం పోసే ఆ సీక్రెట్ వస్తువు ఏంటో తెలుసా?

వాడిపోతున్న తులసి మొక్కను మళ్లీ పచ్చగా మార్చే ఆ అద్భుతమైన వస్తువు మరేదో కాదు.. మన ఇంట్లో నిత్యం ఉండే తాజా పెరుగు. వినడానికి వింతగా ఉన్నా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెరటి చిట్కా విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పద్ధతిని వాడటం వల్ల ఎండిపోతున్న తమ తులసి మొక్కలు కూడా మళ్లీ సరికొత్తగా చిగురించాయని చాలామంది నెటిజన్లు ఫోటోలతో సహా సాక్ష్యాలను పంచుకుంటున్నారు.

పెరుగులో మొక్కకు ఉపయోగపడే పోషకాలు ఇవే

పెరుగులో కాల్షియం, ప్రోటీన్లతో పాటు మొక్కల ఎదుగుదలకు మేలు చేసే మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇవి మట్టికి సహజమైన పోషకాలను అందించి, తులసి మొక్క వేర్లు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి ఎంతో సహాయపడతాయి.

ఈ చిట్కాను ఎలా ఉపయోగించాలి?

పెరుగు మొక్కకు మంచిదే కదా అని నేరుగా తీసుకెళ్లి మట్టిలో పోసేయకూడదు, అలా చేస్తే మొక్క పాడైపోయే ప్రమాదం ఉంది. నిపుణులు చెబుతున్న సరైన పద్ధతి ఇక్కడ చూడండి:

లిక్విడ్ తయారు చేసుకోండి: ఒక కప్పు నీటిని తీసుకుని, అందులో కేవలం ఒక టేబుల్ స్పూన్ తాజా పెరుగును వేసి బాగా కలపాలి. అది పల్చటి మజ్జిగ లాంటి ద్రావణంగా మారాలి.

ఎప్పుడు పోయాలి?: ఈ పల్చటి పెరుగు ద్రావణాన్ని ప్రతి 15 నుండి 20 రోజులకు ఒకసారి మాత్రమే తులసి మొక్క మొదట్లో పోయాలి.

లాభం: ఇలా చేయడం వల్ల మట్టిలో పోషకాల శాతం పెరిగి వేర్లు బలపడతాయి. తద్వారా తులసి ఆకులు పచ్చగా, దట్టంగా ముదురు రంగులోకి మారుతాయి.

తులసి మొక్క వేగంగా పెరగడానికి మరికొన్ని ముఖ్యమైన టిప్స్

సూర్యరశ్మి చాలా ముఖ్యం: తులసి మొక్కకు రోజుకు కనీసం 4 నుండి 5 గంటల పాటు ఖచ్చితంగా ఎండ తగలాలి. మొక్కను ఎప్పుడూ నీడలోనే ఉంచితే దాని ఎదుగుదల పూర్తిగా మందగిస్తుంది.

ఎక్కువ నీరు పోయకండి: తులసి మొక్కలు పాడైపోవడానికి ప్రధాన కారణం ఓవర్ వాటరింగ్. మట్టి పైభాగం పొడిగా అనిపించినప్పుడు మాత్రమే నీరు పోయడం అలవాటు చేసుకోండి.

సహజ ఎరువులు వాడేటప్పుడు జాగ్రత్త: చాలామంది తులసి కోసం టీ పొడి, ఆవు పేడ, అరటి తొక్కల వంటి సహజ ఎరువులను వాడుతుంటారు. ఇవి మంచివే అయినప్పటికీ చాలా పరిమిత పరిమాణంలోనే వాడాలి. ఎరువులు ఎక్కువైతే వేర్లు కుళ్లిపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంది.

Follow Us