ఇది ఒక అమృతఫలం..రోజూ ఒక్కటి తింటే డాక్టర్‌తో పనే ఉండదు!

22 June 2026

Jyothi Gadda

మనకు మార్కెట్లో సాధారణంగా పసుపు, పచ్చ రంగుల్లో ఉండే అరటిపండ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ, అప్పుడప్పుడు కనిపించే ఎర్ర అరటిపండ్ల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..!

ఎర్ర అరటిపండ్లలో విటమిన్ సి, విటమిన్ బి6, పొటాషియం వంటి అవశ్యక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేవలం ఒక చిన్న ఎర్ర అరటిపండు తిన్నా శరీరానికి రోజూ కావలసిన విటమిన్ సి లో అధిక శాతం అందుతుంది. 

ఇది శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, రోగనిరోధక శక్తిని (Immunity) బలోపేతం చేస్తుంది. ఇందులో పొటాషియం మరియు మెగ్నీషియం శాతాలు చాలా ఎక్కువ.

పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాన్ని తగ్గించి రక్తపోటును (High Blood Pressure) నియంత్రిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.

ఎర్ర అరటిపండులో పీచుపదార్థం, ప్రీబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ప్రేగులలో మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రోజూ రాత్రి పూట ఒక ఎర్ర అరటిపండు తినడం మంచిది. 

దీనిలో ఉండే బీటా-కెరోటిన్, లుటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. వయసు పెరగడం వల్ల వచ్చే కంటి సమస్యలను ఇవి నివారిస్తాయి.

అలాగే, ఇందులోని విటమిన్ బి6 మరియు సి చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలు పడకుండా కాపాడటానికి ఉపయోగపడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే గుణం ఉంది.

ఎర్ర అరటిపండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. వ్యాయామం చేసేవారు లేదా అలసటగా ఉన్నవారు ఈ పండును తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

సాధారణ అరటిపండ్లతో పోలిస్తే వీటి ధర కొంచెం ఎక్కువే అయినప్పటికీ, ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వారంలో కనీసం రెండు మూడు సార్లయినా ఎర్ర అరటిపండ్లను తినడం మంచిదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.