Makara Sankranti: మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు? బ్రహ్మ ముహూర్తం లేదా సూర్యోదయం తర్వాత
మకర సంక్రాంతి హిందూ మతంలో ప్రధాన పండుగ. ఈ రోజున సూర్యుడు ఉత్తరం వైపు కదులుతాడు. దీంతో ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. మకర సంక్రాంతి రోజున స్నానం చేయడం, దానం చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో.. ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున స్నానం, దానం చేయడానికి అనుకూలమైన సమయం ఏమిటో తెలుసుకుందాం.
హిందూ మతంలో మకర సంక్రాంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వేద పంచాంగం ప్రకారం సూర్యభగవానుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకరరాశిలోకి ప్రవేశించే రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ఈ పండును వివిధ పేర్లతో వివిధ సాంప్రదాయాలతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున పుణ్యనదులలో స్నానమాచరించి శక్తి కొలదీ దానాలు ఇస్తారు హిందూ విశ్వాసాల ప్రకారం ఈ రోజున దానంతో పాటు పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయి.
ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఎప్పుడు?
సూర్య భగవానుడు మకర రాశిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఉత్తరాయణ కాలం మొదలవుతుంది. ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున స్నానం , దానం చేయడానికి అనుకూలమైన సమయం ఏమిటో తెలుసుకుందాం. వేద పంచాంగం ప్రకారం జనవరి 14వ తేదీ మంగళవారం ఉదయం 9.03 గంటలకు సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈ రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటారు.
స్నానానికి, దానధర్మాలకు అనుకూలమైన సమయం ఎప్పుడంటే
మకర సంక్రాంతి పూజలు, స్నానాలు, దానధర్మాలకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజ, స్నానం, దానధర్మాలు కేవలం శుభ సమయంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. జనవరి 14న ఉదయం 9.03 గంటలకు పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ పుణ్యకాలం సాయంత్రం 5.46 గంటల వరకు ఉంటుంది, అయితే ఈ రోజు మహా పుణ్యకాలం 45 నిమిషాల సమయం ఉంది. ఈ మహాపుణ్యకాలం ఉదయం 10.03 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 10.48 గంటలకు ముగుస్తుంది. మకర సంక్రాంతి రోజున స్నానం, దానధర్మాలు చేయడానికి మంచి సమయం ఉన్నప్పటికీ.. మహాపుణ్య కాలంలో స్నానం, దానధర్మాలు అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి.
మకర సంక్రాంతి ప్రాముఖ్యత
హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణం వైపు అంటే ఉత్తరం వైపు కదులుతాడు. కనుక ఈ పండుగను ఉత్తరాయణి అని కూడా అంటారు. ఈ రోజున సూర్య భగవానుని పూజించే సంప్రదాయం ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్యునితో పాటు విష్ణువును కూడా పూజిస్తారు. ఈ రోజు నువ్వుల వంటకాలు, రకరకాల వంటకాలు, పాలు బియ్యంతో చేసిన పరమాన్నం వంటివి సాంప్రదాయ వంటలు చేస్తారు. ఈ రోజు నువ్వులను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున నువ్వులను దానం చేసి.. పాయసం సూర్యుడి నైవేద్యంగా సమర్పించడం వలన సూర్యుడు, మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.