Thailand tourism: థాయిలాండ్ కు పర్యాటకుల క్యూ.. 2024లో ఎంతమంది సందర్శించారంటే..?
ఉరుకులు, పరుగుల జీవితంలో పడి కొట్టుమిట్టాడుతున్న వారందరూ ఏ మాత్రం ఖాళీ దొరికినా పక్షుల్లా ఎగిరిపోవాలనుకుంటారు. ముఖ్యంగా విదేశాల్లో పర్యటించడానికి ఆసక్తి చూపుతారు. అక్కడి అడవులు, బీచ్ లు, ఇతర చారిత్రక ప్రదేశాల్లో విహరించాలనుకుంటున్నారు. ఇలాంటి వారందరికీ థాయిలాండ్ ఘన స్వాగతం పలుకుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఆ దేశానికి వెళ్లడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024లో దాదాపు 35 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులు థాయిలాండ్ వెళ్లారు.
థాయిలాండ్ కు ప్రధాన ఆదాయ వనరు పర్యాటకమే. కోవిడ్ మహమ్మారి రాక ముందు అనేక లక్షల మంది పర్యాటకులు ఆ దేశానికి వెళ్లేవారు. అక్కడి బీచ్ లు, అందమైన ప్రదేశాల్లో సందడి చేసేవారు. దాదాపు ఏడాది పొడవునా సందర్శకులతో కిటకిటలాడేది. 2019లో సుమారు 39 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులు విచ్చేశారు. అనంతరం కోవిడ్ రావడం, ప్రయాణాలకు ఆంక్షలు పెరగడంతో పర్యాటకం బోల్తా పడింది. కోవిడ్ అనంతరం ఆంక్షలను తొలగించినా పుంజుకోలేదు. ఇప్పుడు 2024లో 35 మిలియన్లకు చేరడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. వచ్చే సంవత్సరం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు. థాయిలాండ్ కు వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల్లో భారతీయులు ఎక్కువ మంది ఉండడం విశేషం. మొదటి స్థానంలో మలేషియా, రెండో స్థానంలో ఇండియా, మూడో స్థానంలో చైనా కొనసాగుతున్నాయి.
పర్యాటకులను ఆకర్షించడానికి థాయిలాండ్ అనేక చర్యలు చేపడుతోంది. వీసా నిబంధనల సడలింపు, స్వలింగ సంపర్కులకు చట్టబద్దత కల్పించడం వంటి అంశాలు అనుకూలంగా మారాయి. అంతర్జాతీయ రాకపోకలు పెంచడానికి భారత్, చైనాతో పాటు అనేక దేశాల ప్రయాణికులకు ఉచిత వీసాలు అందిస్తోంది. పర్యాటకంగా వచ్చే ఏడాది మరిన్ని లక్ష్యాలను థాయ్ ప్రభుత్వం నిర్దేశించుకుంది. 2025లో సుమారు 39 మిలియన్ల ప్రయాణికులను స్వాగతించాలని భావిస్తోంది. కరోనా పూర్వం ఉన్న స్థితికి రావాలని చర్యలు చేపడుతోంది. భారతీయ ప్రయాణికులకు థాయ్ ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. వీసా రహిత విధానాన్ని ప్రవేశపెట్టింది. వీసా అవసరం లేకుండానే సుమారు 60 రోజుల పాటు ఆ దేశంలో ఉండే వీలుంటుంది. దీని ద్వారా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాలని నిర్ణయించుకుంది. భారతీయులు 60 రోజుల పాటు వీసా లేకుండా ఆ దేశంలో పర్యటించవచ్చు. దాని కన్నా ఎక్కువ రోజులు థాయిలాండ్ లో ఉండాలనుకునేవారు రాయల్ థాయ్ ఎంబసీ లేదా కాన్సులేట్ ద్వారా వీసాను పొందాలి.
పర్యాటకులు సంఖ్య విపరీతంగా పెరగడానికి థాయిలాండ్ వ్యూహాత్మక విధానాలే కారణమని తెలుస్తోంది. 2024 డిసెంబర్ 7 నాటికే ఆ దేశం తన వార్షిక లక్ష్యాన్నిఅధిగమించి, 35,047,501 మంది సందర్శకులను అనుమతించింది. 93 దేశాల పౌరులకు వీసా మినహాయింపులు, 60 రోజుల పాటు వీసా రహితంగా పర్యటించే అవకాశం, కీలకమైన ఆరు సరిహద్దుల వద్ద టీఎం.16 ఇమ్మిగ్రేషన్ ఫారాలను తొలగించడం వంటి వాటి కారణాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి