లాహోర్ లో జరిగిన బాంబు దాడిపై పాకిస్తాన్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం.. ఇండియా ఫైర్
లాహోర్ లో గత నెలలో జరిగిన బాంబు దాడికి ఇండియాదే బాధ్యత అంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇది నిరాధారమైన ప్రాపగాండా అని పేర్కొంది.
లాహోర్ లో గత నెలలో జరిగిన బాంబు దాడికి ఇండియాదే బాధ్యత అంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇది నిరాధారమైన ప్రాపగాండా అని పేర్కొంది. అసలు మీ గడ్డపై నుంచే టెర్రరిజం పుట్టిందన్న విషయాన్ని ,మరిచిపోకండి అని దుయ్యబట్టింది. లాహోర్ లో లష్కరే తోయిబా ఫౌండర్ హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో గత నెల 23 న జరిగిన బాంబు దాడిలో నలుగురు మరణించగా సుమారు డజను మంది గాయపడ్డారు. ఈ దాడిలో ఇండియా హస్తం ఉందని పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఆరోపించారు. ఇక ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు యూసుఫ్ కూడా ఇదే ఆరోపణ చేశారు. ఇండియాకు చెందిన రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) అధికారి ఒకరు ఇందుకు సూత్రధారి అని ఆయన ఆరోపించాడు. పైగా ఈ బాంబు దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించడానికే జమ్మూ లోని ఐఏఎఫ్ పై డ్రోన్ల దాడి విషయాన్నీ భారత ప్రభుత్వం లేవనెత్తిందన్నారు.
అయితే పాకిస్తాన్ ఈ విధమైన ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదని.భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. పాక్ మొదట తన ఇంటిని చక్కదిద్దుకోవాలని..తన గడ్డపై సాగుతున్న ఉగ్రవాదాన్ని అదుపు చేయాలని ఆయన అన్నారు. టెర్రరిస్టులకు మీ దేశం స్వర్గధామం అని పేర్కొన్నారు. ఉగ్రవాదం విషయానికి వచ్చేసరికి పాక్ నిర్వాకం అందరికీ తెలిసిందేఅన్నారు. ఐరాసలో ఎన్నిసార్లు మీ వైఖరిని ఎండగట్టినా మీరు మారడంలేదని ఆయన విరుచుకపడ్డారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Crime News: పక్కింటికే కన్నం వేసిన పోకిరి.. ఎలా చిక్కాడంటే..?