ఎనర్జీ + ఆరోగ్యం.. ఒక కప్పు బొంబాయి రవ్వతో సూపర్ టేస్ట్ గంజి.. 10 నిమిషాల్లోనే రెడీ..
సాయంత్రం వేళల్లో తేలికగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఏదైనా తీసుకోవాలనుకునేవారికి ఆంధ్ర స్టైల్ బొంబాయి రవ్వ గంజి అద్భుతమైన ఎంపిక. కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ గంజి శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు సులభంగా జీర్ణమవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అనువైన ఈ సూపర్‌ఫుడ్, వేసవిలో శరీరానికి చలువనిస్తూ పోషకాలను అందిస్తుంది.

దాదాపు అందరికీ.. సాయంత్రం వేళల్లో ఏదైనా తినాలనిపిస్తుంది.. లేదా వేడివేడిగా ఏదైనా సూప్ లాంటిది తాగాలనిపిస్తుంది. అలాంటి వారికి సూపర్ ఫుడ్ కాండినేషన్ బెస్ట్ బొంబాయి రవ్వ గంజి.. ఇది అత్యంత పోషకమైన, తేలికగా అరిగే సాంప్రదాయ ఆహారం.. ఇది ఒంటికి చలువ చేయడంతోపాటు.. తక్షణ శక్తిని ఇస్తుంది.. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు, అదేవిధంగా ఏదైనా అనారోగ్య సమస్యతో నీరసంగా ఉండేవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది. ఇంకా చిన్న పిల్లలకు, పెద్దలకు బలవర్థకమైన ఆహారం.. ఎండాకాలంలో తేలికగా జీర్ణమయ్యే, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం.. సాయంత్రం వేళల్లో తినగలిగే సూపర్‌ఫుడ్‌లలో 10 నిమిషాల్లో తయారుచేసుకోగలిగే ఆంధ్ర స్టైల్ బొంబాయి రవ్వ గంజి రెసిపీ అద్భుతమైన ఎంపిక. ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా, శరీరానికి తక్షణ శక్తిని, పోషణను అందిస్తుందని.. ఆహార నిపుణులు చెబుతున్నారు.
ఈ గంజిని తయారుచేయడం చాలా తేలికైన ప్రక్రియ. ముందుగా, స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, అందులో చిన్న బిర్యానీ ఆకు, అర అంగుళం దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, రెండు లవంగాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి. తరువాత, మధ్యస్థాయి ఉల్లిపాయ ఒకటి చిన్నగా తరిగి, రెండు పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఆ తరువాత, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పేస్ట్ బాగా వేగిన తర్వాత, మధ్యస్థాయి టమాటా ఒకటి చిన్నగా తరిగి వేసి, బాగా కలుపుకోవాలి. మూత పెట్టి, టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.
టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత, చిన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల బీన్స్, రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్ వేసి బాగా కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి మధ్యస్థాయి మంటపై రెండు నిమిషాలు ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత, కొంచెం పుదీనా ఆకులు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి. పుదీనా, కొత్తిమీర గంజికి మంచి సువాసన, రుచిని అందిస్తాయి.
ఆ తరువాత, పావు టీస్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత, ఒక లీటరు వరకు నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మూత పెట్టి, నీళ్లు హై ఫ్లేమ్‌లో బాగా మరిగేంతవరకు ఉడికించాలి. నీళ్లు మరిగిన తర్వాత, ఒక కప్పు బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) తీసుకోవాలి. ఒకవేళ బొంబాయి రవ్వ పడని వారు బియ్యం రవ్వను కూడా ఉపయోగించవచ్చు. బియ్యం రవ్వ బయట లభిస్తుంది.. లేదా ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. రవ్వను వేసేటప్పుడు ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
రవ్వ వేసిన తర్వాత, రుచి చూసి, అవసరమైతే మరికొంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మధ్యస్థాయి మంటపై రెండు నుండి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. గంజి పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేయాలి, ఎందుకంటే అది చల్లబడిన తర్వాత చిక్కబడుతుంది. సూప్ లాగా తాగడానికి పలచగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ గంజి చిక్కబడినట్లయితే, అవసరాన్ని బట్టి వేడి నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఈ సులభమైన గంజిని ఎప్పుడైనా సూప్‌గా తీసుకోవచ్చు. దీనికి కొద్దిగా బూందీ కలిపి తీసుకుంటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన బొంబాయి రవ్వ గంజిని మీరూ ప్రయత్నించి చూడండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
