భార్య విడాకులు ఇచ్చిందని వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి హైడ్రామా.. ప్రాణాలకు తెగించిన కానిస్టేబుల్!
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం (జూన్ 02) ఓ యువకుడు మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి, ట్యాంక్ పైనుంచి దూకేస్తానంటూ సదరు యువకుడు చేసిన హంగామాతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. అయితే, పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, చాకచక్యంగా అతడిని రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం (జూన్ 02) ఓ యువకుడు మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు తాగి, ట్యాంక్ పైనుంచి దూకేస్తానంటూ సదరు యువకుడు చేసిన హంగామాతో ఆ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. అయితే, పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, చాకచక్యంగా అతడిని రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ మండలంలోని శాత్రాజుపల్లె గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు గత కొంతకాలంగా కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. తన భార్యతో తనకు విడాకులు వచ్చేలా రమేష్ అనే వ్యక్తి కుట్ర పన్నాడని అశోక్ ఆరోపించాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన అతడు, మొదట పురుగుల మందు సేవించాడు. ఆ తర్వాత సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న మున్సిపల్ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి దూకేస్తానంటూ కేకలు వేశాడు.
అశోక్ ట్యాంక్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించడం చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కింద సేఫ్టీ నెట్లు ఏర్పాటు చేస్తూనే, అశోక్‌ను కిందికి దింపేందుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, తాను ఇప్పటికే పురుగుల మందు తాగానని, ఎలాగూ కొద్దిసేపట్లో చనిపోతానంటూ అశోక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. కిందికి దూకేందుకు అడుగులు వేయడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది.
సమయం గడుస్తున్న కొద్దీ అశోక్ ఒంట్లో విషం పాకే ప్రమాదం ఉండటంతో ఎస్బీ కానిస్టేబుల్ శ్రీనివాస్ ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. అశోక్ గమనించకుండా చాకచక్యంగా వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. అశోక్ వెనుక వైపు నుంచి మెరుపు వేగంతో దూసుకెళ్లి, అతడిని గట్టిగా పట్టుకున్నారు. అదే సమయంలో మరికొందరు పోలీసులు కూడా పైకి చేరుకుని యువకుడిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నారు.
సురక్షితంగా కిందికి దించిన వెంటనే అశోక్‌ను ఫైర్ ఇంజిన్ వాహనంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తక్షణమే అత్యవసర చికిత్స అందించడంతో ప్రస్తుతం అశోక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. సమయానికి స్పందించి, ధైర్యసాహసాలతో ఓ యువకుడి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను, సిరిసిల్ల పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులతో పాటు స్థానిక ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
