AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఖాకీల కళ్లు గప్పి దశాబ్దకాలం ‘దూమ్’.. భార్యను చంపే స్కెచ్‌తో సెల్ఫ్ గోల్.. ఎలా చిక్కాడంటే?

దశాబ్ద కాలంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు... ఎవరిని అడిగినా అతడు ఎప్పుడో చనిపోయాడు అనే సమాధానమే వస్తోంది. కానీ, చనిపోయాడనుకున్న ఆ కరుడుగట్టిన నేరస్థుడు క్షేమంగా బ్రతికే ఉండటమే కాకుండా, తెరవెనుక మరో ఘోరానికి స్కెచ్ వేస్తూ కరీంనగర్ రూరల్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

ఖాకీల కళ్లు గప్పి దశాబ్దకాలం 'దూమ్'.. భార్యను చంపే స్కెచ్‌తో సెల్ఫ్ గోల్.. ఎలా చిక్కాడంటే?
Dhoom Khalid Arrested
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 02, 2026 | 3:38 PM

Share

దశాబ్ద కాలంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు… ఎవరిని అడిగినా అతడు ఎప్పుడో చనిపోయాడు అనే సమాధానమే వస్తోంది. కానీ, చనిపోయాడనుకున్న ఆ కరుడుగట్టిన నేరస్థుడు క్షేమంగా బ్రతికే ఉండటమే కాకుండా, తెరవెనుక మరో ఘోరానికి స్కెచ్ వేస్తూ కరీంనగర్ రూరల్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ఖాలీద్ అలియాస్ ‘ధూమ్ ఖాలీద్’ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పోలీసులు అతడిని వలవేసి పట్టుకున్నారు.

గతంలో కరీంనగర్‌లో ఒక ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన ఘోర అఘాయిత్యం కేసులో ధూమ్ ఖాలీద్ ప్రధాన నిందితుడు. ఆ ఘటన తర్వాత ఆగ్రహించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేసి, కాళ్లపై బండరాళ్లతో మోదారు. తీవ్ర గాయాలవడంతో వైద్యులు అతడి రెండు కాళ్లను తొలగించారు. ఆ కేసులో అరెస్ట్ అయి, బెయిల్‌పై బయటకు వచ్చిన ఖాలీద్.. అప్పటి నుండి కరీంనగర్ వైపు కన్నెత్తి చూడకుండా పరారయ్యాడు.

రెండు కాళ్లు లేకపోయినా అతడి నేర బుద్ధి మాత్రం మారలేదు. మహారాష్ట్రకు పారిపోయి నాగపూర్, నాందేడ్, చంద్రపూర్, బల్లార్ష వంటి ప్రాంతాలలో కొత్త గ్యాంగులను ఏర్పాటు చేసుకున్నాడు. దర్గాల వద్ద భిక్షగాడి వేషంలో షెల్టర్ తీసుకుంటూ, వాహనాలలో తిరుగుతూ దారిదోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు, గ్యాంగ్ రేప్‌లకు పాల్పడటం మొదలుపెట్టాడు. అమాయక యువతను ఆకర్షించి తన ముఠాల్లోకి లాగేవాడు. ఇటు హైదరాబాద్, కరీంనగర్‌లతో పాటు అటు మహారాష్ట్రలోనూ అతడిపై డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ రూరల్‌లో 5, వన్‌టౌన్‌లో 2, టూటౌన్‌లో ఒక కేసు ఉండగా.. భయంతో జనం ఫిర్యాదు చేయని వందకు పైగా నేరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసులు అతడి కోసం వెతికినప్పుడల్లా చనిపోయాడు అన్న వదంతులు రావడంతో ఆచూకీ కష్టంగా మారింది. అయితే, తాజాగా హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో నివసిస్తున్న తన భార్యను హతమార్చేందుకు ఖాలీద్ గత ఆరు నెలలుగా కుట్ర పన్నుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. ఈ స్కెచ్‌లో భాగంగానే అతడు కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడని తెలుసుకున్న రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి బృందం సోమవారం (జూన్ 01) మెరుపు దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది.

పదేళ్లుగా తప్పించుకుంటున్న ఘరానా క్రిమినల్‌ను పట్టుకున్న సీఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకోవడంలో ఈ బృందం చూపిన చొరవ ఆదర్శనీయమన్నారు. ధూమ్ ఖాలీద్‌ను పాత లైంగిక దాడి కేసులో కోర్టులో హాజరుపరచగా, మిగిలిన కేసుల్లో పిటిషన్లు వేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కరుడుగట్టిన నేరస్థుడు జైలుకే పరిమితమయ్యేలా కఠిన శిక్షలు పడేలా చూడాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us