BYD Seagull: ఫుల్ ఛార్జ్‌తో 500 కిమీల జర్నీ.. తక్కువ ధరకే భారత మార్కెట్లోకి చైనా సంచలనం..!
BYD Seagull India Launch: భారతదేశంలో బడ్జెట్ కార్ల మార్కెట్ చాలా పెద్దది. మారుతి, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఏలుతున్న ఈ విభాగంలోకి ఒక సరసమైన ఎలక్ట్రిక్ కారు వస్తే వినియోగదారులు ఖచ్చితంగా బ్రహ్మరథం పడతారు. బీవైడీ సీగల్ కనుక రూ. 10 లక్షల లోపు ధరతో వస్తే, అది మధ్యతరగతి కుటుంబాల ఈవీ కలను నిజం చేయడమే కాకుండా, భారత ఆటోమొబైల్ రంగాన్ని సరికొత్త మలుపు తిప్పనుంది.

BYD Seagull India Launch: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల విప్లవం వేగంగా పుంజుకుంటున్నప్పటికీ, సామాన్య మధ్యతరగతి ప్రజలకు మాత్రం ఈవీ కల ఇంకా అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. మార్కెట్లో ఉన్న కార్ల ధరలు రూ. 10 లక్షలు దాటడంతో కొనుగోలుదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ చైనా వాహన దిగ్గజం బీవైడీ, సరికొత్త బడ్జెట్ ఈవీతో భారత మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది.
మధ్యతరగతి కల నిజం కానుందా?
మన దేశంలో లక్షలాది మంది పెట్రోల్, సీఎన్‌జీ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వైపు మారాలని ఆశపడుతున్నారు. కానీ మార్కెట్లో ఉన్న అధిక ధరలు వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయి. ప్రస్తుతం టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే బడ్జెట్ పరిధిలో కార్లను అందిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో సామాన్యుడికి అందుబాటులో ఉండే మోడళ్ల సంఖ్య చాలా తక్కువ. బ్యాటరీ తయారీ వ్యయం, ఇతర సాంకేతిక ఖర్చుల వల్ల కంపెనీలు ధరలను తగ్గించలేకపోతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ‘సూపర్ హిట్’..
చైనాకు చెందిన బీవైడీ (BYD) సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సంస్థకు ఉన్న అతిపెద్ద బలం ఏమిటంటే, వీరు సొంతంగా బ్యాటరీలను తయారు చేసుకుంటారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా తగ్గుతుంది. చైనాలో ఈ కంపెనీ నుంచి వచ్చిన ‘సీగల్’ మోడల్ అక్కడ విపరీతమైన ప్రజాదరణ పొందింది. అంతర్జాతీయ మార్కెట్లలో దీనిని ‘డాల్ఫిన్ మినీ’ అనే పేరుతో విక్రయిస్తున్నారు.
భారత్‌లో ట్రేడ్‌మార్క్.. త్వరలోనే లాంచ్..?
చైనా మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర భారత కరెన్సీలో సుమారు రూ. 9 లక్షల పరిధిలోనే ఉంది. ఇదే ధరతో భారతదేశంలో కనుక అడుగుపెడితే, ఇక్కడి ఈవీ మార్కెట్ సమీకరణాలు పూర్తిగా మారిపోవడం ఖాయం. దీనికి బలం చేకూరుస్తూ, బీవైడీ సంస్థ ఇటీవల ‘సీగల్’ పేరును భారతదేశంలో ట్రేడ్‌మార్క్ చేసింది. సాధారణంగా ఏ కంపెనీ అయినా కొత్త మోడల్‌ను దేశంలో ప్రవేశపెట్టే ముందే ఇలాంటి చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేస్తుంది. దీంతో ఈ కారు త్వరలోనే భారతీయ రోడ్లపై పరుగులు తీయనుందనే వార్తలకు మరింత బలం చేకూరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
