AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్ పెట్రోల్ vs నార్మల్ పెట్రోల్.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసా..? పవర్ కొట్టిస్తే ఎక్కువ మైలేజ్ వస్తుందా తెలుసుకోండి..

బైక్ అయినా, కార్ అయినా.. మనం పెట్రోల్ బంకుకు వెళ్లిన ప్రతిసారీ క్యాషియర్ అడిగే కామన్ ప్రశ్న.. నార్మల్ పెట్రోల్ కొట్టాలా..? పవర్ పెట్రోల్ కొట్టాలా అని.. దీంతో చాలా మందికి కొన్ని డౌట్లు వస్తాయి. పవర్ పెట్రోల్ కొట్టిస్తే బండి మైలేజ్ ఏమైనా పెరుగుతుందా? లేక ఇంజన్ లైఫ్ బాగుంటుందా? అనే సందేహాలు కామన్. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అనేది తెలుసుకుందాం..

పవర్ పెట్రోల్ vs నార్మల్ పెట్రోల్.. వీటి మధ్య తేడా ఏంటో తెలుసా..? పవర్ కొట్టిస్తే ఎక్కువ మైలేజ్ వస్తుందా తెలుసుకోండి..
Normal Petrol Vs Power Petrol
Krishna S
|

Updated on: Jun 23, 2026 | 9:19 PM

Share

పెట్రోల్ బంకుకు వెళ్లిన ప్రతిసారీ వాహనదారులకు ఒక సాధారణ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది..సార్, నార్మల్ పెట్రోలా? పవర్ పెట్రోలా? అని అక్కడున్న వారు అడగడం కామన్. పవర్ పెట్రోల్ ధర సాధారణ పెట్రోల్ కంటే లీటరుకు రూ. 5 నుండి రూ. 10 వరకు ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది అసలు ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడా ఏంటి? ఎక్కువ పైసలు పెట్టి పవర్ పెట్రోల్ కొట్టించడం వల్ల మైలేజ్ ఏమైనా పెరుగుతుందా? లేదా ఇంజన్ లైఫ్ పెరుగుతుందా? అనే సందేహాల్లో ఉంటారు. ఈ విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఆక్టేన్ రేటింగ్ అంటే ఏమిటి?

నార్మల్ పెట్రోల్‌కు, పవర్ పెట్రోల్‌కు ఉన్న ప్రధాన తేడా ఆక్టేన్ నంబర్. నార్మల్ పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ సాధారణంగా 91 ఉంటుంది. ఇది సాధారణ మైలేజ్ ఇచ్చే కారు, బైకులకు సరిపోతుంది. పవర్ పెట్రోల్ ఆక్టేన్ రేటింగ్ 95 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇంధనం వాహన ఇంజన్ సిలిండర్లలో ఎంత ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలదో ఈ ఆక్టేన్ రేటింగ్ తెలియజేస్తుంది.

ఇంజన్ నాకింగ్ కు చెక్

సాధారణ పెట్రోల్ వాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఇంధనం ముందే మండిపోయి ఇంజన్ నుండి ఒక రకమైన కటకట శబ్దం వస్తుంది. దీన్నే ఇంజన్ నాకింగ్ అంటారు. దీనివల్ల ఇంజన్ లైఫ్ తగ్గిపోతుంది. పవర్ పెట్రోల్ ఎక్కువ ఒత్తిడిని తట్టుకోగలదు కాబట్టి ఇది నాకింగ్ సమస్యను పూర్తిగా నివారిస్తుంది.

ప్రత్యేక అడిటివ్స్ – డిటర్జెంట్లు

పవర్ పెట్రోల్‌లో ఇంధన కంపెనీలు కొన్ని ప్రత్యేక కెమికల్స్, క్లీనింగ్ డిటర్జెంట్లను కలుపుతాయి. ఇవి ఇంజన్ లోపల ఉండే ఫ్యూయల్ ఇంజెక్టర్లు, వాల్వ్స్‌పై కార్బన్ పేరుకుపోకుండా క్లీన్ చేస్తాయి. దీనివల్ల ఇంధన దహనక్రియ సజావుగా సాగుతుంది.

పవర్ పెట్రోల్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు..

మెరుగైన పికప్ – పవర్: వాహనం యాక్సిలరేషన్ స్మూత్‌గా ఉంటుంది. త్వరగా వేగాన్ని పుంజుకుంటుంది.

తక్కువ కాలుష్యం: ఇంధనం పూర్తిగా మండటం వల్ల సైలెన్సర్ నుండి వచ్చే హానికర ఉద్గారాలు తగ్గుతాయి.

లాంగ్ రన్‌లో ఇంజన్ రక్షణ: కార్బన్ పేరుకుపోకపోవడం వల్ల ఇంజన్ విడిభాగాలు ఎక్కువ కాలం మన్నుతాయి.

ఏ వాహనానికి ఏది బెస్ట్?

నార్మల్ పెట్రోల్ ఎవరికి?: మన దేశంలో ఎక్కువగా వాడే సాధారణ కమ్యూటర్ బైకులు, బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో కంప్రెషన్ రేషియో తక్కువగా ఉంటుంది. ఇవి నార్మల్ పెట్రోల్‌తోనే పర్ఫెక్ట్‌గా నడుస్తాయి. వీటికి ఎక్కువ డబ్బులు పెట్టి పవర్ పెట్రోల్ కొట్టించినా మైలేజ్‌లో ఎలాంటి అదనపు మ్యాజిక్ జరగదు.

పవర్ పెట్రోల్ ఎవరికి?: టర్బో ఛార్జ్డ్ ఇంజన్లు ఉన్న కార్లు, లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైకులు, హై కంప్రెషన్ ఇంజన్ వాహనాలకు పవర్ పెట్రోల్ ఎంతో అవసరం. వీటిలో నార్మల్ పెట్రోల్ పోస్తే పికప్ తగ్గిపోవడమే కాకుండా ఇంజన్ పాడయ్యే ప్రమాదం ఉంది.

మీ బండికి ఏ పెట్రోల్ వాడాలనేది మీ వాహనంతో పాటు వచ్చే ఓనర్స్ మాన్యువల్ పుస్తకంలో స్పష్టంగా రాసి ఉంటుంది. అందులో 95 RON లేదా ప్రీమియం ఇంధనం వాడమని సూచిస్తేనే పవర్ పెట్రోల్ వాడండి. ఒకవేళ నార్మల్ పెట్రోల్ సరిపోతుందని ఉంటే అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. అయితే సాధారణ వాహనదారులు కూడా తమ ఇంజన్ క్లీన్‌గా ఉండటం కోసం ప్రతి 4 లేదా 5 ట్యాంకుల నార్మల్ పెట్రోల్ తర్వాత, ఒకసారి పవర్ పెట్రోల్ కొట్టించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us