Petrol Diesel Price: సామాన్యులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న పెట్రోల్ డీజిల్ ధరలు?
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో అంతర్జాతీ మార్కెట్‌లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పుంజుకుంటోంది. ఈ మార్పుతో రాబోయే రెండేళ్లలో ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ ధరల తగ్గింపు మన దేశంలో వెంటనే అమలు అవుతుందా? రాబోయే రోజుల్లో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం యావత్ ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. చమురు సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడడంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి చేరి, ఇంధన, వాణిజ్య సంక్షోభం తలెత్తేలా కనిపించింది. కానీ తాజాగా అమెరికా- ఇరాన్ మధ్య జరిగిన శాంతి ఒప్పందంతో చమురు ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెండ్ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు $77.39 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతుంటే.. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు సుమారు $73.57 వద్ద ట్రేడ్ అవుతోంది.
అయితే ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో, ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు అవసరానికి మించి పెరిగిపోతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో ప్రపంచ చమురు సరఫరా, డిమాండ్ కంటే చాలా వేగంగా పెరుగుతుందని, తద్వారా 2027 నాటికి చమురు మిగులు ఏర్పడుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) పేర్కొంది. పశ్చిమ ఆసియాలో జరిగిన యుద్ధం కారణంగా రోజుకు 14 మిలియన్ బ్యారెళ్ల (bpd) చమురు ఉత్పత్తి నిలిచిపోయిందని IEA అంచనా వేసింది.
క్రిస్టల్ ఎనర్జీ గ్లోబల్ అడ్వైజర్ క్రిస్టాఫ్ రూహ్ల్ అభిప్రాయం ప్రకారం.. 2027 నాటికి ప్రపంచ సరఫరా, డిమాండ్ కంటే రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 60 డాలర్ల కంటే కిందకు పడిపోయే అవకాశం ఉంది. దీని ప్రభావంతో భారత్‌లో ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని గేట్‌వే హౌస్‌లో ఎనర్జీ, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ కనెక్టివిటీ సీనియర్ ఫెలో అమిత్ భండారీ తెలిపారు. అయితే ఈ తగ్గదల అనేది తక్షణమే ఉండకోవచ్చని.. దానికి దాదాపు 5-6 నెలల సమయం పడుతుందన్నారు.
అంతేకాదు రాబోయే రోజుల్లో ప్రపంచ ఇంధన మార్కెట్లలో భారీ మార్పులు రాబోతున్నాయని నిపుణులు అంటున్నారు. 2027 నాటికి ప్రపంచ చమురు సరఫరా రోజుకు సుమారు 8 మిలియన్ బ్యారెళ్లు పెరుగుతుందని, కానీ డిమాండ్ కేవలం 2 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని వల్ల ప్రపంచ మార్కెట్‌లో భారీ ఎత్తున చమురు మిగులు ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఇది ప్రపంచ దేశాలకు ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తోందని.. ఇది ధరలను తగ్గించడమే కాకుండా.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఏర్పడి కొరతను ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు.
అమెరికా-ఇరాన్ ఒప్పందం ఇలాగే కొనసాగితే గల్ఫ్ దేశాల నుండి చమురు ఎగుమతులు క్రమంగా పుంజుకుంటాయని IEA భావిస్తోంది. శాశ్వత ఒప్పందం కుదిరి, ఇరాన్ ఎగుమతులపై ఆంక్షలు తొలగిపోతే, మరింత ముడి చమురు అంతర్జాతీయ మార్కెట్లలోకి వస్తుంది. ఇది సరఫరాను మరింత మెరుగుపరిచి, చమురు ధరలపై ఉన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని తగ్గిస్తుందని పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
