అదొక చెత్త సీన్.. నాకు ఇష్టం లేకుండానే తీశా.. ఇప్పటికీ ఆ విషయంలో బాధగానే ఉంటుంది
దర్శకుడు వి.వి. వినాయక్, చిరంజీవి వంటి మెగాస్టార్ సినిమాకు దర్శకత్వం వహించడం ఒక అసాధారణమైన ఒత్తిడి, పెద్ద బాధ్యత అని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ సినిమా గురించి ఆసక్తిగా విషయాన్ని పంచుకున్నారు.

దర్శకుడు వి.వి. వినాయక్ తన సినీ ప్రయాణం గురించి ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకుడిగా, హీరోల ఇమేజ్‌ను ఎన్హాన్స్ చేసే వ్యక్తిగా, స్టార్ హీరోల పిల్లలను లాంచ్ చేసే డైరెక్టర్‌గా తనపై ఉన్న ట్యాగ్స్ గురించి ప్రస్తావించగా, వాటిని బాధ్యతాయుతంగానే నిర్వర్తించానని అన్నారు. అయితే, అఖిల్ సినిమా తన కెరీర్‌కు పెద్ద దెబ్బ అని, ఆర్థికంగా నష్టపోయానని అన్నారు వినాయక్. సినిమా హిట్, ఫ్లాప్ అనేది కథ ఎంపికలోనే దాగి ఉంటుందని వినాయక్ స్పష్టం చేశారు. ఒక సినిమాకు నలుగురు రచయితలు పనిచేసినట్లే, మరో సినిమాకు కూడా బోలెడు మంది రచయితలు కష్టపడతారని, పరుచూరి వెంకటేశ్వరరావు, వెలిగొండ శ్రీనివాస్, కోన వెంకట్ వంటి ప్రముఖ రచయితలతో చర్చించి కథలు సిద్ధం చేసిన సందర్భాలున్నాయని గుర్తు చేసుకున్నారు. కష్టంలో ఎక్కడా తేడా ఉండదని, ఫలితంలోనే తేడా ఉంటుందని ఆయన అన్నారు. ప్రేక్షకులు అలియన్ కథల కంటే, తెలిసిన విలన్ ఉండే, నేటివ్ గా ఉండే కథలనే ఎక్కువగా ఆదరిస్తారని వినాయక్ అభిప్రాయపడ్డారు.
తన కెరీర్‌లో తీసిన బిగ్గర్ దెన్ లైఫ్ సినిమాల గురించి మాట్లాడుతూ, సుమోలు గాల్లో ఎగరడం, భూమిలోంచి బయటికి రావడం వంటి అన్-రియలిస్టిక్ సన్నివేశాలు ఒకప్పుడు ప్రజలు చూడటానికి ఇష్టపడేవారని చెప్పారు. ఫ్యాక్షన్ సినిమాలకు క్రేజ్ ఉన్నప్పుడు, అలాంటి సన్నివేశాలు ఆదరణ పొందేవని, ఆ సమయంలో ప్రేక్షకులు అటువంటి వాటిని చూడటానికి మానసికంగా సిద్ధంగా ఉండేవారని తెలిపారు. అయితే, గత పదేళ్లలో ప్రేక్షకుల అభిరుచులు మారాయని, వారు అప్డేట్ అయ్యారని, ఇప్పుడు అటువంటి సన్నివేశాలను కారణం లేకుండా తీస్తే జనం చీత్కరించుకుంటారని వివరించారు. అలాగే తన కెరీర్‌లో చెన్నకేశవరెడ్డి చిత్రాన్ని తన బెస్ట్ వర్క్ గా వినాయక్ అభివర్ణించారు. ఆ చిత్రంలో కథ, స్క్రీన్ ప్లేలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని, తాను సస్పెన్స్ అనుకున్నది కన్ఫ్యూజన్‌గా మారిందని ఆయన అన్నారు.
బాలకృష్ణ వంటి పెద్ద స్టార్‌తో, భారీ బడ్జెట్‌తో సినిమా తీసేటప్పుడు ఉండే మెచ్యూరిటీ లేకపోవడం దీనికి కారణమని చెప్పారు. అయితే, ఆ సినిమా పెద్ద హిట్ అయిన తర్వాత, ఇలాంటి సినిమాలే తీయాలి ఇలాంటి షాట్ లే పెట్టాలి అని ఇవే నిజమని నమ్ముకునే అమాయకత్వంలో ఉండేవాడినని, ఆతర్వాత మొట్టికాయలు పడ్డ తర్వాత రియాలిటీలోకి వచ్చాను అని తెలిపారు వివి వినాయక్. ఇక ఛా, ఈ సీన్ తీసి ఉండకూడదని తాను బాధపడిన సినిమా సాంబ అని వినాయక్ వెల్లడించారు. ఆ చిత్రంలోని ఒక చెత్త సన్నివేశాన్ని తాను కెమెరా పెట్టి తీయడం ఇష్టం లేకపోయినా, బలవంతంగా, షూటింగ్ ఆగిపోతుందేమోనని, దరిద్రాలు ఎందుకని తీసిన తర్వాత, ఎడిట్‌లో చూసి, అది బాగుందని చెప్పి, విడుదల చేయాల్సి వచ్చిందని అన్నారు. ఆ సన్నివేశం పట్ల తనకు ఎప్పటికీ పశ్చాత్తాపం ఉంటుందని, అది తన కెరీర్‌లోని ఒక తీరని బాధ అని వినాయక్ స్పష్టం చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
