AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాధుల సీజన్ వచ్చేస్తోంది.. ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే డాక్టర్ అవసరమే ఉండదు..!

వర్షాకాలం ప్రారంభంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు పెరిగే సమయంలో వాము ఆకు మొక్క సహజ ఔషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణశక్తిని మెరుగుపరచడం, గ్యాస్, అజీర్ణం సమస్యలను తగ్గించడం, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలిగించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. వాము ఆకుల రసం, ఆవిరి పీల్చడం ద్వారా జలుబు, కఫం, ముక్కు దిబ్బడ తగ్గుతాయని చెబుతున్నారు.

వ్యాధుల సీజన్ వచ్చేస్తోంది.. ఇంట్లో ఈ ఒక్క మొక్క ఉంటే డాక్టర్ అవసరమే ఉండదు..!
Food (6)
Shaik Madar Saheb
|

Updated on: Jun 04, 2026 | 8:16 PM

Share

వ్యాధుల సీజన్ వచ్చేస్తోంది.. ప్రధానంగా వర్షాకాలం ప్రారంభంలో వైరస్లు, బ్యాక్టీరియా, దోమల ద్వారా ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తుంటాయి.. జలుబు, దగ్గు, జ్వరం లాంటివి కేసులు పెరుగుతాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవడం ఉత్తమం.. అయితే, కొన్ని ఔషధ గుణాలున్న మొక్కలు అలాగే.. చిట్కాలతో ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు.. అలాంటి అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కల్లో వాము మొక్క ఒకటి.. వాము ఆకులు (Carom/Ajwain leaves) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సీజనల్ వ్యాధులు, ఎన్నో సమస్యలను నివారించేందుకు సహాయపడతాయి.. వాము ఆకు కేవలం వంటకాల్లో ఉపయోగించేది మాత్రమే కాదు, అనేక ఔషధ గుణాలు కలిగిన అద్భుతమైన మొక్క. వాము బజ్జీలు అందరికీ సుపరిచితమే అయినప్పటికీ, ఈ ఆకుల్లోని వాలటైల్ ఆయిల్స్.. ఇతర గుణాలు మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. దీనిని పట్టుకున్నా, తుంచినా వచ్చే సువాసన అరోమా థెరపీగా కూడా పనిచేస్తుందని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో వాము ఆకుల ఉపయోగాలను, ఔషధ గుణాలను వివరించారు.

వాము ఆకుల ప్రయోజనాలు..

జీర్ణకోశ వ్యవస్థకు మేలు: వాము ఆకు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో కనిపించే జీర్ణ సంబంధిత వ్యాధులు, అజీర్ణం, పొట్ట ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, అధిక అపానవాయువు వంటి వాటికి ఇది మంచి పరిష్కారం. భోజనం తర్వాత రెండు పచ్చి వాము ఆకులను నమిలి, ఆ రసాన్ని మింగడం వల్ల తేలికగా జీర్ణమై, పైన చెప్పిన ఇబ్బందులు తగ్గుతాయి. పెద్దవారిలో గ్యాస్ సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.

శ్వాసకోశ వ్యవస్థకు ప్రయోజనాలు:

వాము ఆకులోని వాలటైల్ ఆయిల్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ జలుబు నుండి బ్రాంకైటిస్, గొంతులో కఫం, పిల్లి కూతలు, బ్రాంకియోల్ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్, ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఇస్నోఫీలియా వంటి వాటికి ఇది ప్రయోజనకారి. కఫ దోషాలతో బాధపడేవారు వాము ఆకులను దంచి రసం తీసి, వయసును బట్టి ఒక చెంచా (5 మి.లీ.) నుండి రెండు, మూడు చెంచాల వరకు తీసుకోవచ్చు. ఈ రసానికి శొంఠి లేదా అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనం రెట్టింపు అవుతుంది.

ఆవిరి పీల్చడం ద్వారా ఉపశమనం:

వాము ఆకులను కొద్దిగా క్రష్ చేసి వేడి నీటిలో వేసి ఆవిరి పీల్చడం వల్ల ముక్కు రంధ్రాల్లోని మ్యూకస్ లేయర్‌పై వాలటైల్ ఆయిల్స్ పనిచేసి కఫాన్ని బయటికి నెట్టేస్తాయి. దీనివల్ల ముక్కు దిబ్బడ తగ్గి, చాలా రిలాక్సింగ్‌గా, సూదింగ్ లక్షణాలను అనుభూతి చెందుతారు.

తలనొప్పి, జ్వరం ఉపశమనం:

పిల్లల్లో వచ్చే చిన్నపాటి తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు వాము ఆకులను నలిపి కణతల పైన పెట్టడం లేదా రసాన్ని పేస్ట్‌లా నుదుటిపై రాయడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.

నులిపురుగుల నివారణ:

పిల్లల్లో నులిపురుగుల (వార్మ్ ఇన్ఫెస్టేషన్) సమస్య సర్వసాధారణం. దీనివల్ల పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోలేకపోవడం, బలహీనంగా మారడం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. వాము ఆకు రసం జీర్ణశక్తిని మెరుగుపరిచి, ఆకలిని పెంచుతుంది. ప్రతిరోజూ 10 మి.లీ. రసాన్ని నీటిలో కలిపి ఇవ్వడం వల్ల నులిపురుగులు తగ్గి, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు దూరమవుతాయి.

కాల్షియం సమతుల్యత:

వాము ఆకుల్లోని ప్రత్యేక గుణం కాల్షియం సమతుల్యతను కాపాడుతుంది. ఆహారంలోని కాల్షియంను శరీరం సరిగ్గా గ్రహించుకునేలా చేసి, ఎముకల బలానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి తోడ్పడుతుంది. శరీరంలో కాల్షియం స్థాయిలు సరైన మోతాదులో ఉండేలా ఇది సహాయపడుతుంది.

ముఖ్య గమనిక: వాము గింజల చెట్టు వేరు, వాము ఆకు చెట్టు వేరు.. వాము ఆకు అన్ని వయసుల వారు ఉపయోగించదగిన మంచి ఔషధ మొక్క. దీనిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. అయితే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే ఉపయోగించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us