IT Notices: హాలో బ్రదర్.. ఈ 5 లావాదేవీలు చేస్తే మీకు ఐటీ నోటీసులు రావడం పక్కా..
Income Tax Rule: పన్ను ఎగవేతదారులను నివారించేందుకు ఆదాయపు పన్ను శాఖ నిఘాను మరింత పెంచింది. ఈ మేరకు సాంకేతికతను బాగా ఉపయోగించుకుంటోంది. టెక్నాలజీ ఆధారంగా డేటాను విశ్లేషించి పన్ను ఎగవేతదారులను పట్టుకుంటోంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటుండటంతో చాలా ఆర్ధిక లావాదేవీలు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నిఘాలోకి వెళుతున్నాయి.

మీరు సేవింగ్స్ అకౌంట్‌లో పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తున్నాారా..? భారీ మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తున్నారా..? క్రెడిట్ కార్డ్స్ నుంచి పెద్ద మొత్తంలో నగదు ఖర్చు చేస్తున్నారా..? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే బాసూ. ఎందుకంటే ఐటీ శాఖ ఇటీవల పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భారీ మొత్తంలో చేసే ట్రాన్సాక్షన్లపై ఐటీ శాఖ ప్రత్యేక నిఘా అనేది ఉంటుంది. మీ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు సరిపోలకపోతే ఐటీ శాఖ మీకు నోటీసులు పంపి చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఐదు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు ఐటీ శాఖ పర్యవేక్షణలోకి వెళతాయనేది ఒకసారి చూద్దాం.
ఇలాంటి లావాదేవీలు చేస్తున్నారా..?
-సేవింగ్స్ అకౌంట్‌లో ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షల లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడం, బదిలీ చేయడం లాంటివి చేస్తే బ్యాంకులు మీ సమాచారాన్ని ఐటీ శాఖకు పంపుతాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణలోకి మీరు వెళతారు. మీ ఆదాయంతో సరిపోలకపోతే ఐటీ శాఖ మీకు నోటీసులు అందించవచ్చు.
-ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడి పెట్టి ఉన్నా మీ డీటైల్స్‌ను బ్యాంకులు ఐటీ శాఖకు పంపుతాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయనే వివరాలు, ఆధారాలు సమర్పించాల్సి రావొచ్చు
-ఇక క్రెడిట్ కార్డు ద్వారా ఎక్కువగా ఖర్చు పెట్టినా ఐటీ శాఖ దృష్టికి వెళుతుంది. మీ ఆదాయం, ఖర్చు మధ్య వ్యత్యాసం ఉంటే మీకు ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.
-అలాగే మీరు భారీ మొత్తం ఖర్చు పెట్టి ఇల్లు, భూమి, అపార్ట్‌మెంట్ వంటివి కొనుగోలు చేసినా లేదా అమ్మిన సమయంలో పెద్ద మొత్తంలో నగుదు బదిలీ జరిగినా ఐటీ శాఖ దృష్టికి వెళుతుంది. ఆ నగదు ఎక్కడ నుంచి వచ్చిందనే ఆధారాలు భద్రపర్చుకోండి. ఆస్తిని కొనుగోలు చేసినా లేదా అమ్మినా వాటి పత్రాలను దాచుకోవడం మర్చిపొవద్దు
-ఇక స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినా ఆ సమాచారాన్ని సదరు ఆర్ధిక సంస్థలు ఐటీ శాఖకు పంపుతాయి. మీ ఆదాయం కంటే పెట్టుబడులు ఎక్కువగా ఉంటే ఐటీ శాఖ మీపై దృష్టి పెడుతుంది. దీంతో మీకు ఐటీ శాఖ నుంచి నోటీసులు రావొచ్చు.
ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..
మీకు ఎలాంటి సమస్యలు ఐటీ శాఖ నుంచి రాకుండా ఉండాలంటే.. మీరు ఆర్ధిక ట్రాన్సాక్షన్లకు సంబంధించిన రికార్డులను భద్రపర్చుకోండి. మీకు ఆదాయం ఎక్కడ నుంచి వస్తుందనే వివరాలు ఉంచుకోండి. ఐటీ రిటర్న్స్ సకాలంలో దాఖలు చేయండి. క్యాష్ పేమెంట్స్ కంటే డిజిటల్ లావాదేవీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.
