Surname: మన ‘ఇంటి పేర్లు’ ఎలా పుట్టాయి..? వాటి వెనుక ఉన్న చరిత్ర ఏంటి..?
భారతదేశంలో ఇంటి పేర్ల వాడకం ఒక వ్యక్తి చరిత్ర, ప్రాంతం, వంశ క్రమానికి అధికారిక ముద్రగా చరిత్రకారులు పేర్కొంటారు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ప్రకారం, ఒక కుటుంబంలోని సభ్యులందరికీ ఉమ్మడిగా ఉండే పేరునే ఇంటిపేరు అంటారు. ప్రాచీన కాలంలో వ్యక్తుల గుర్తింపు గోత్రం, ప్రవరలతో జరిగేదని చరిత్రకారుడు ఎస్ కృష్ణారెడ్డి తెలిపారు. ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ రాజవంశాల కాలంలో పరిపాలనా సౌలభ్యం కోసం వృత్తులను బట్టి గుర్తింపులు ఇచ్చేవారు. కమ్మరి, కుమ్మరి, మజుందార్, పటేల్, దేశ్‌ముఖ్ వంటి ఇంటి పేర్లు వృత్తుల ద్వారా వచ్చాయి.

మన పేరు ముందు ఉండే ఇంటిపేరు.. నిజానికి అది ఒక కుటుంబ చరిత్ర. ఒక ఊరి జాడ. ఒక వృత్తి గుర్తు. కొన్ని సందర్భాల్లో ఒక రాజ్య పరిపాలన ముద్ర కూడా. నేడు ఆధార్, పాస్‌పోర్ట్, బ్యాంక్ ఖాతా నుంచి స్కూల్ సర్టిఫికేట్ వరకూ తప్పనిసరిగా మారిపోయిన “సర్‌నేమ్” వ్యవస్థ వెనుక శతాబ్దాల కథ దాగి ఉంది. చరిత్రకారుల ప్రకారం, భారతదేశంలో ఇంటి పేర్లు ఒక్కరోజులో పుట్టలేదు. ప్రాచీన కాలంలో వ్యక్తులను గుర్తించేందుకు గోత్రం, ప్రవర, తండ్రి పేరు, వంశ పరంపరలనే ఎక్కువగా ఉపయోగించేవారు. అప్పటి ఋషులు, రాజులకు నేటి తరహా ఇంటిపేర్లు లేకపోయినా, వారు చేసిన కార్యాలు లేదా వారి వంశాన్ని సూచించే పేర్లతో గుర్తింపు ఉండేది.
కాలక్రమేణా రాజ్యాలు పెరిగాయి. పరిపాలన క్లిష్టమైంది. ముఖ్యంగా మధ్యయుగంలో ఢిల్లీ సుల్తాన్లు, మొఘలుల కాలంలో వృత్తి ఆధారంగా గుర్తింపులు పెరిగాయి. అలా కమ్మరి, కుమ్మరి, దేశ్‌ముఖ్, పటేల్, మజుందార్ వంటి పేర్లు క్రమంగా ఇంటి పేర్లుగా మారాయి. అంటే ఒకరి పని.. తర్వాత వారి కుటుంబ గుర్తింపుగా స్థిరపడింది.
తెలుగు ప్రాంతాల్లో ఇంటి పేర్ల చరిత్ర మరింత ప్రత్యేకం. చరిత్రకారుల పరిశోధనల ప్రకారం, తెలుగు ప్రజల్లో 8వ–9వ శతాబ్దాల నుంచే ఇంటిపేర్ల ఆనవాళ్లు కనిపించినా, శాసనాల్లో మాత్రం అవి స్పష్టంగా 14వ శతాబ్దం తర్వాతే కనిపించడం మొదలైంది. అంతకుముందు వ్యక్తులను గోత్రం, వేదశాఖ, తండ్రి పేరుతో పేర్కొనేవారు. ఆ తర్వాత గ్రామాల పేర్లు ఇంటిపేర్లుగా మారడం మొదలైంది. ఒక ఊరి నుంచి వచ్చినవారిని ఆ గ్రామం పేరుతో పిలిచేవారు. క్రమంగా అదే కుటుంబ గుర్తింపుగా స్థిరపడింది. ఉదాహరణకు గ్రామ నామాలు, బిరుదులు, హోదాలు, వృత్తులు, మూలపురుషుల పేర్లు.. ఇవి అన్నీ తర్వాతి తరాల్లో ఇంటిపేర్లుగా మారిపోయాయి.
అయితే ఇంటిపేర్లకు అధికారిక రూపం ఇచ్చింది బ్రిటిష్ పాలన. వారు ఇంటిపేర్లను సృష్టించలేదు. కానీ వాటిని ప్రభుత్వ రికార్డుల్లో శాశ్వత గుర్తింపుగా మార్చారు. ముఖ్యంగా 1871-72లో జరిగిన తొలి జనగణనలో ఒకే గ్రామంలో ఒకే పేరున్న వ్యక్తులను వేరు చేయడం కోసం “పర్టిక్యులర్ టైటిల్” తప్పనిసరి చేశారు. అదే తర్వాత సర్‌నేమ్ కాలమ్‌గా మారింది. ఆ రోజు జనగణన రిజిస్టర్లలో నమోదైన పేర్లే.. నేడు ఆధార్, పాన్, పాస్‌పోర్ట్‌లలో కొనసాగుతున్నాయి. అంటే మన ఇంటిపేరు కేవలం కుటుంబ గుర్తింపే కాదు.. బ్రిటిష్ పరిపాలనా వ్యవస్థ నుంచి వచ్చిన అధికారిక ముద్ర కూడా.
ఇక తెలుగు సంప్రదాయంలో ఇంటిపేరు ముందు వస్తుంది. పాశ్చాత్య దేశాల్లో మాత్రం చివరన ఉంటుంది. అందుకే తెలుగువారు ఇంటిపేరులోని మొదటి అక్షరాన్ని ఇనీషియల్‌గా వాడడం ప్రారంభించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో మాత్రం ఒకే విధానం లేదు. తమిళనాడులో చాలా మంది తండ్రి పేరునే ఉపయోగిస్తారు. కేరళలో ఒకప్పుడు తల్లి ఇంటి పేరుకు ప్రాధాన్యం ఉండేది. ఉత్తర భారతంలో ఎక్కువ ఇంటిపేర్లు వృత్తులతో సంబంధం కలిగి ఉంటాయి. అంటే.. మన ఇంటిపేరు అనేది కేవలం పేరు ముందు ఉండే ఒక పదం కాదు. అది మన మూలాలు, వృత్తులు, వలసలు, గ్రామాలు, పాలనా వ్యవస్థలు, సంస్కృతుల మార్పులన్నింటినీ మోసుకెళ్లే జీవ చరిత్ర.
