మొబైల్ EMI కట్టకపోతే ఫోన్ లాక్? RBI కొత్త ప్రతిపాదనలు
EMIలు చెల్లించకపోతే మొబైల్ ఫోన్ ఫీచర్లను రిమోట్‌గా నిలిపివేయడానికి RBI కొత్త నిబంధనలు ప్రతిపాదించింది. 90 రోజుల బకాయి తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవాలని, అత్యవసర సేవలు మాత్రం కొనసాగించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

మన దేశంలో మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను రుణాలపై కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, RBI కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. రుణగ్రహీతలు EMIలు చెల్లించడంలో విఫలమైతే, కొన్ని కఠిన నిబంధనలు, షరతులకు లోబడి, రుణదాతలు మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్‌లోని కొన్ని ఫీచర్లను రిమోట్‌గా నిలిపివేయడానికి అనుమతించేలా కొత్త ముసాయిదా నిబంధనలను RBI విడుదల చేసింది. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (కమర్షియల్ బ్యాంకులు – బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తన) సవరణ ఆదేశాలు, 2026’ పేరుతో విడుదలైన ఈ ముసాయిదా అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నిబంధనల ప్రకారం, రుణం 90 రోజులు బకాయిగా ఉన్నప్పుడు మాత్రమే రుణదాతలు పరికరంపై పరిమితులు విధించగలరు.
అయితే ఇందుకు ముందు రుణగ్రహీతలకు దశలవారీగా నోటీసులు ఇవ్వడం తప్పనిసరి. EMI గడువు దాటిన 60 రోజుల తర్వాత మొదటి నోటీసు జారీ చేయాలి. అందులో బకాయిలు చెల్లించేందుకు 21 రోజుల గడువు ఇవ్వాలి. ఆ తర్వాత కనీసం మరో వారం గడువుతో రెండో నోటీసు పంపిన తర్వాతే ఫోన్ ఫంక్షన్లపై ఆంక్షలు అమలు చేయవచ్చు. అత్యంత ముఖ్యంగా రుణ ఒప్పందంలో వినియోగదారుల స్పష్టమైన సమ్మతి ఉంటేనే ఈ విధానం అమలు చేయవచ్చని RBI స్పష్టం చేసింది. అలాగే, ఈ టెక్నాలజీని రుణ బకాయిల వసూలు కోసమే ఉపయోగించాలి గానీ, ఇతర ప్రయోజనాలకు వినియోగించరాదని పేర్కొంది.
ఇంటర్నెట్ సేవలు, ఇన్‌కమింగ్ కాల్స్, అత్యవసర SOS ఫీచర్లు, ప్రభుత్వ హెచ్చరికల వంటి కీలక సేవలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయరాదని RBI ఆదేశించింది. రుణగ్రహీత బకాయిలు చెల్లించిన గంటలోపే ఆంక్షలు ఎత్తివేయాలని, అలా చేయకపోతే గంటకు రూ.250 చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అదేవిధంగా ఫోన్ లాక్ చేసిన సందర్భంలో వినియోగదారుల వ్యక్తిగత డేటాను బ్యాంకులు లేదా రికవరీ ఏజెంట్లు యాక్సెస్ చేయకుండా నిషేధం విధించారు. రుణ వసూలు ప్రక్రియలో వినియోగదారుల గోప్యతకు భంగం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని RBI పేర్కొంది.
రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై కూడా RBI కఠిన నిబంధనలు ప్రతిపాదించింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే రుణగ్రహీతలను సంప్రదించాలి. బెదిరింపులు, దుర్భాషలు, అవమానాలు లేదా కుటుంబ సభ్యులను వేధించడం వంటి చర్యలను పూర్తిగా నిషేధించింది. భారతదేశంలో ప్రస్తుతం మూడింట ఒక వంతుకు పైగా వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వస్తువులు చిన్న మొత్తాల రుణాలపై కొనుగోలు అవుతున్నాయి. దేశంలో 1.16 బిలియన్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉండటంతో, ఈ కొత్త నిబంధనలు కోట్లాది వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశముంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
