ఫ్లెక్సీల అరాచకానికి చెక్.. రూల్స్ అతిక్రమిస్తే ఉపేక్షించను.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతున్నారని అధికారులను ప్రశ్నించారు. ఇకపై ఫ్లెక్సీల విషయంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీలపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతున్నారని అధికారులను ప్రశ్నించారు. ఇకపై ఫ్లెక్సీల విషయంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, హైడ్రా, మున్సిపల్, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేసి జూన్ 15 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మారుతున్న కాలం, పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోలీసు శాఖ కొత్త సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పావిలియన్‌లో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐజీలు, కమిషనర్లు పాల్గొన్నారు. పోలీసు వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని సీఎం ప్రకటించారు. కేవలం మెరిట్ ఆధారంగానే పోస్టింగులు ఉంటాయని, సిఫార్సులకు తావులేదని తేల్చి చెప్పారు. అవినీతిపై కనికరం చూపబోమని హెచ్చరిస్తూ.. ఎస్‌ఐ నుంచి నాన్ కేడర్ ఎస్పీ వరకు ప్రమోషన్ పొందిన వారు కనీసం రెండేళ్ల పాటు ఇతర విభాగాల్లో పనిచేసేలా కొత్త నిబంధనలు తేవాలని డీజీపీని ఆదేశించారు. ఉన్నతాధికారులు తమ హెడ్‌క్వార్టర్ వదిలి వెళ్తే తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని చెప్పారు.
సమాజంలో క్యాన్సర్ వంటి వ్యాధులు పెరగడానికి ఆహార కల్తీ ప్రధాన కారణమని ఆందోళన వ్యక్తం చేసిన సీఎం, దీనిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అవసరమైతే కఠినమైన కొత్త చట్టాన్ని రూపొందించాలని సూచించారు. అలాగే, ప్రతి పోలీస్ స్టేషన్‌లో క్యూ ఆర్ కోడ్ (QR Code) విధానం ద్వారా ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని, తద్వారా పోలీసుల పనితీరుపై పారదర్శకత పెరుగుతుందని అన్నారు. అలాగే, కాలం చెల్లిన ఆయుధాల స్థానంలో ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని, డ్రోన్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. పర్యావరణ హితంగా పోలీసు శాఖలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని, నైట్ పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ మరియు సీసీ కెమెరాల వ్యవస్థను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బాధితుల కోసం డీ-అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, సైబర్ క్రైమ్ నియంత్రణకు స్కిల్స్ యూనివర్సిటీలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. వ్యవస్థకు లోబడి పనిచేసే ప్రతి అధికారికి ప్రభుత్వం అండగా ఉంటుంది, కానీ పరిధి దాటితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
