Tomato Flu: వేగంగా విస్తరిస్తోన్న టమాటా వైరస్.. ఎవరికి ఎక్కువ రిస్కో తెలుసా?
మధ్యప్రదేశ్లో ని పాఠశాల పిల్లల్లో అకస్మాత్తుగా ఎర్రటి దద్దుర్లు, బొబ్బలతో కూడిన ఒక వింత వ్యాధి వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ (HFMD) అని పిలిచే ఈ వైరస్ ను స్థానికంగా 'టమాటా ఫ్లూ' అని వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాధి 12 ఏళ్ల లోపు పిల్లల్లో వేగంగా వ్యాపిస్తున్న కారణంగా, భోపాల్ లోని పాఠశాలలు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశాయి. ఈ వైరస్ లక్షణాలు ఏమిటి? దీనికి గల కారణాలు, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణుల సలహాలు తెలుసుకుందాం.

కోవిడ్ -19 మహమ్మారి తర్వాత దేశంలో మరో కొత్త వైరస్ తెరపైన నిలిచింది. ఇందులో భాగంగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలోని పాఠశాల విద్యార్థుల్లో ఒక ప్రత్యేక అనారోగ్యం వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకిన వారికి చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింది భాగం, నోటిలో ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయి. తర్వాత అవి బొబ్బలుగా మారుతున్నాయి.
టమాటా వైరస్ భోపాల్ లో కలకలం సృష్టిస్తోంది. చిన్నారుల్లో దురద, మంట, నొప్పి అనిపించడంతో పాటు జ్వరం, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
12 ఏళ్ల లోపు పిల్లల పైన ప్రభావం!
ఈ వైరస్ గురించి పిల్లల వైద్య నిపుణులు వివరిస్తున్నారు. టమాటా వైరస్ ను సాధారణంగా ‘హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్’ (హెచ్ ఎమ్ ఎమ్ డీ) అని పిలుస్తారు. ఈ వ్యాధి ఎచినోకాకస్, కాక్సాకీవైరస్ ల వల్ల వస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా 6 నెలల నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్లో కనిపిస్తుంది. ఇది చేతులు, కాళ్లు, నోటి లోపల స్పష్టమైన దద్దుర్లతో పాటు జ్వరం కలిగిస్తుంది.
ఆందోళన వద్దు:
ఇదే సమయంలో, హెచ్ ఎమ్ ఎమ్ డీ చిన్న సమస్యేనని, పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదని డాక్టర్ రాజేష్ తెలిపారు. ఈ వైరస్ వారం, పది రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం మల విసర్జన తర్వాత చేతులు సరిగా కడుక్కోకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం అని ఆయన స్పష్టం చేశారు.
తల్లిదండ్రులకు పాఠశాలల విజ్ఞప్తి
భోపాల్ లోని చాలా ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు ఈ టమాటా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో పాఠశాలల యాజమాన్యం ఈ వ్యాధి గురించి తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. ఇలాంటి పిల్లలను పాఠశాలకు పంపవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండటం వల్ల, మన బిడ్డకు ఈ వ్యాధి ఉంటే, అతడిని ఇతర పిల్లలతో కలవనివ్వకపోవడం మన సామాజిక బాధ్యత అని వైద్యులు చెబుతున్నారు.




