White Rice Side Effects: వైట్ రైస్ తీసుకోవడం వల్ల ఆ సమస్యలు రావచ్చు.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు..
భారతదేశంలోని ప్రధాన ఆహార పదార్థాల్లో బియ్యం ఒకటి. దేశంలో బియ్యం విస్తారంగా పండుతుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతంలో బియ్యాన్ని అధికంగా వినియోగిస్తుంటారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం తప్పకుండా..

భారతదేశంలోని ప్రధాన ఆహార పదార్థాల్లో బియ్యం ఒకటి. దేశంలో బియ్యం విస్తారంగా పండుతుంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతంలో బియ్యాన్ని అధికంగా వినియోగిస్తుంటారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం తప్పకుండా ఉంటుంది. అయితే పలు అధ్యయనాల ప్రకారం వైట్ రైస్ ఆరోగ్యానికి హానికరమని తెలుపుతున్నాయి. అంతే కాకుండా బియ్యాన్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నాయి. బరువు తగ్గాలనుకునే వారికి రైస్ నష్టం కలిగిస్తుందే తప్ప ఎలాంటి అదనపు ప్రయోజనం అందించదు. అందుకే వ్యక్తి బరువు తగ్గాలనుకుంటే అన్నం తినకూడదని పోషకాహార నిపుణులు సలహా ఇస్తాృుంటారు. ఎందుకంటే బియ్యంలో ఉండే కార్బో హైడ్రేట్స్ బరువు పెంచడంలో సహాయపడుతుంది. పిండి పదార్ధాల్లోని గ్లూకోజ్ రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. 2,500 మందిపై చేసిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వీరిలో తెల్ల బియ్యం తినడం వల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇది మిఠాయిలో ఉండే చక్కెరతో సమానమని వివరించారు. తెల్ల బియ్యం స్థానంలో ఓట్స్, బ్రౌన్ రైస్, గోధుమలను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అధిక మొత్తంలో శుద్ధి చేసిన ధాన్యాలతో తయారైన ఆహారాన్ని తీసుకున్న వ్యక్తులు రక్తంలో చక్కెర పెరుగుదల, బరువు పెరగడం, గుండె సమస్యలు బయటపడ్డాయి. ఇవి మున్ముందు రక్తపోటు పెరుగుదలతో పాటు రక్త నాళాలను దెబ్బ తీస్తున్నట్లు గుర్తించారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు.. గుండె ఆరోగ్యం కోసం పండ్లు, చిక్కుళ్ళు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు తినాలని సూచిస్తున్నారు. ఢిల్లీలోని జస్ట్ డైట్ క్లినిక్ వ్యవస్థాపకురాలు జస్లీన్ కౌర్ మాట్లాడుతూ.. అధిక మొత్తంలో శుద్ధి చేసిన ధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుందన్నారు. 70 శాతం కార్బోహైడ్రేట్లు, 30 శాతం ప్రోటీన్లు, కొవ్వులు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. వ్యక్తి బరువు తగ్గాలనుకుని డైట్ ఫాలో అయ్యేటప్పుడు వారి భోజనంలో అన్నం తీసుకోవడం మంచిది కాదు.
ఐరన్ ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే గోధుమ రంగులో ఉండే బియ్యాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సమస్యలు ఉండవన్నారు. ధూమపానం, ఆల్కహాల్, రిఫైన్డ్ షుగర్ లేదా జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వస్తాయి. వైట్ రైస్ తినడం మాత్రమే గుండె సమస్యలకు దారితీస్తుందనేది కేవలం అపోహ అని ఆమె చెప్పారు. ఐరన్-ఫోర్టిఫైడ్ రైస్ ను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వారికి సరైన సూచనలు లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. శరీరంలో ఐరన్ అధికంగా ఉండటాన్ని హెమోక్రోమాటోసిస్ అంటారు. ఐరన్ కాలేయం, ప్లీహము, ప్యాంక్రియాస్‌లో కూడా పేరుకుపోతుంది. ఇది దీర్ఘకాలిక కాలేయ వ్యాధికి దారితీయవచ్చు.




మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి