ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
Boiled Egg Vs Omelette: ప్రోటీన్‌కు గుడ్లు ఉత్తమం. అందుకే డైలీ గుడ్లు తినమని వైద్యులు సూచిస్తారు. అయితే బరువు తగ్గాలనుకునేవారికి ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్‌లలో ఏది మంచిదనే సందేహం ఉంటుంది. రెండింటిలో ఏది మంచిది..? మరి కేలరీల లెక్కల్లో ఏది గెలుస్తుంది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాల్లో గుడ్డుకు సాటిలేదు. అందుకే చాలా మంది తమ అల్పాహారంలో గుడ్లను ఖచ్చితంగా చేర్చుకుంటారు. అయితే గుడ్లను వండుకునే విధానాన్ని బట్టి వాటిలోని పోషకాలు, కేలరీల శాతం మారుతుంటాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఉడికించిన గుడ్డు మంచిదా లేక ఆమ్లెట్ మంచిదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
ఉడికించిన గుడ్డు
ఆరోగ్యపరంగా చూస్తే ఉడికించిన గుడ్డు అత్యుత్తమ ఎంపిక. దీనిని నూనె లేదా వెన్న లేకుండా కేవలం నీటిలో ఉడికిస్తారు. కాబట్టి అదనపు కొవ్వు చేరే అవకాశం లేదు. ఒక ఉడికించిన గుడ్డులో సుమారు 70 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తూనే బరువును నియంత్రణలో ఉంచుతాయి. ప్రయాణాల్లో కూడా వీటిని సులభంగా తీసుకువెళ్లవచ్చు.
ఆమ్లెట్
ఆమ్లెట్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది.. కానీ దీని తయారీ విధానమే పెద్ద మైనస్. ఆమ్లెట్ వేయడానికి నూనె, నెయ్యి లేదా వెన్న వాడటం వల్ల కేలరీల శాతం పెరుగుతుంది. ఉపయోగించే నూనెను బట్టి ఒక ఆమ్లెట్‌లో 90 నుండి 200 కేలరీల వరకు ఉండే అవకాశం ఉంది. అయితే ఆమ్లెట్‌లో టమోటాలు, ఉల్లిపాయలు, పాలకూర, క్యాప్సికమ్ వంటి కూరగాయలు చేర్చడం వల్ల ఫైబర్, విటమిన్లు అందుతాయి. తక్కువ నూనెతో వేసుకుంటే ఇది కూడా మంచి పోషకాహారమే.
బరువు తగ్గేవారికి ఏది మేలు?
బరువును వేగంగా తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న వారు ఉడికించిన గుడ్లు తినడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువ. ఒకవేళ మీరు ఆమ్లెట్ తినాలనుకుంటే.. నాన్-స్టిక్ పాన్ ఉపయోగించి అతి తక్కువ నూనెతో, ఎక్కువ కూరగాయలు చేర్చి వండుకోవడం మంచిది. దీనివల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




