పల్లీలు వీరికి విషంతో సమానం.. తినేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Peanuts: చలికాలంలో వేడివేడి పల్లీలు తింటూ కాలక్షేపం చేయడం అందరికీ ఇష్టమే. వీటిని పేదల బాదం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే కాల్చిన పల్లీలు అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాయని అనుకోవడం పొరపాటే. కొంతమందికి ఇవి విషంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వేరుశెనగలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, శరీర శక్తికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా ప్రకారం.. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాల్చిన వేరుశెనగలకు దూరంగా ఉండటమే మంచిది.
ఎవరు వేరుశెనగలు తినకూడదు?
జీర్ణ సమస్యలు ఉన్నవారు
మీరు తరచుగా గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటే కాల్చిన పల్లీలు తినకండి. వీటిలో ఉండే అధిక ఫైబర్, కొవ్వులు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి, దీనివల్ల కడుపులో అసౌకర్యం పెరుగుతుంది. మీరు తినాలనుకుంటే రాత్రంతా నీటిలో నానబెట్టిన వేరుశెనగలను తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.
కాలేయం – పిత్తాశయ సమస్యలు
పిత్తాశయంలో రాళ్లు ఉన్నవారు లేదా కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్నవారు వేరుశెనగలకు దూరంగా ఉండాలి. వేరుశెనగలో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగించి సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
అలెర్జీ ఉన్నవారు
చాలామందికి వేరుశెనగ పడదు. వీటిని తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మానేయాలి. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకమైన అలెర్జీ ప్రతిచర్యలకు దారితీయవచ్చు.
మధుమేహ బాధితులు
షుగర్ ఉన్నవారు వేయించిన లేదా ఉప్పు, కారం కలిపిన వేరుశెనగలను తినకూడదు. ముఖ్యంగా తీపి పూత పూసిన వేరుశెనగలు రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి. డాక్టర్ సలహా మేరకు మాత్రమే పరిమితంగా తీసుకోవాలి.
థైరాయిడ్ సమస్యలు
వేరుశెనగలలో గోయిట్రోజెన్స్ ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉన్నవారు వీటిని పరిమితంగా తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన మార్గం ఏది?
వేరుశెనగలు తినాలనుకునే వారు వాటిని నేరుగా కాల్చుకుని తినడం కంటే నానబెట్టి తినడం వల్ల శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. జీర్ణక్రియ సులభమవుతుంది. అతిగా తింటే బరువు పెరగడం, శరీరంలో వేడి పెరగడం వంటి సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




